ఆమిర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు… ‘సితారే జమీన్ పర్’ సినిమాను యూట్యూబ్ పేపర్ వ్యూ మోడల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో షాక్ కలిగింది. 125 కోట్ల భారీ డీల్‌ను ఓటీటీ దిగ్గజం ప్రైమ్ వీడియో ఆఫర్ చేయగా, ఆమిర్ ఖాన్ తిరస్కరించారు.
వాస్తవానికి ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ వీడియో రూ.125 కోట్లను ఆఫర్ ఇచ్చిందిట. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఓ కొత్త స్ట్రీమింగ్ దిశగా అడుగులు వేస్తూ, ఈ డీల్‌ను తిరస్కరించి తన సినిమాను యూట్యూబ్ మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని డెసైడ్ అయ్యారు.
ఆగస్టు 1 నుంచి ‘సితారే జమీన్ పర్’ యూట్యూబ్ మూవీస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇతర ఓటీటీల్లో ఇది అందుబాటులో ఉండదు. భారత్‌లో ఈ సినిమాను కేవలం రూ.100కి వీక్షించొచ్చు. అంతేకాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా మొత్తం 38 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ స్థానిక ధరల ప్రకారం వీక్షించవచ్చు.
ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ,
“చాలామందికి సినిమా తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని నా కోరిక. ఒక కుటుంబం మొత్తం కలసి రూ.100కి సినిమా చూడొచ్చు. అంటే ఒక్కోరికి రూ.25. నేను చిన్నప్పట్లో పక్కింటి వాళ్లతో సినిమాలు చూశాను. ఇప్పుడు ఎనిమిది మంది కలిసి చూస్తే, ఒక్కొరికీ ఇంకా తక్కువ ఖర్చు. ఒక గ్రామం మొత్తం చూసినా, 100 మంది ఒక్కరూ రూ.1 చొప్పున కూడా కవర్ అవుతారు” అని పేర్కొన్నారు.
“ఎవరు ఎలా వినియోగించుకుంటారో అది వారి ఇష్టమే. కానీ మా ప్రయత్నం మాత్రం ఈ సినిమా దేశం నలుమూలలకూ వెళ్లాలని, అందరికీ అందుబాటులో ఉండాలని. ఇది మా వైపు నుంచి ఓ పెద్ద అడుగు” అని ఆమిర్ స్పష్టం చేశారు.