పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ ముంగిట అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్న కోలీవుడ్ వెటరన్ యాక్టర్ ఆర్. పార్థిబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన మూలాల గురించి చెబుతూ ఆయన వాడిన పదజాలం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పార్థిబన్ మాట్లాడుతూ.. తాను చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ తనది తెలుగు నేపథ్యమని చెప్పుకొచ్చారు. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి “నాయుడు అబ్బాయి” అని సంబోధిస్తూ, తనది కూడా అదే కులమని చేసిన కామెంట్స్ అగ్గి రాజేసాయి. బహిరంగ వేదికపై ఇలా కులం పేరు ఎత్తడంపై ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఇష్యూ వైరల్ కావడంతో పార్థిబన్ వెంటనే స్పందించారు.

తాను చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. “నా వల్ల పొరపాటు జరిగిందని గుర్తించాను, దీనికి నిజంగా విచారిస్తున్నాను. నా టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుంటాను తప్ప, కులం పేరు చెప్పుకుని బతకాలని ఎప్పుడూ అనుకోలేదు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమా ఈరోజు థియేటర్లలోకి వస్తున్న తరుణంలో ఈ వివాదం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కూడా త్రిష, విజయ్ విషయంలో పార్థిబన్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం గమనార్హం.

#Parthiban Apologises, #Parthiban's Caste Comments, #Pawan Kalyan, #Ustaad Bhagat Singh

By admin