
తన ఉన్న ఊళ్ళోనే ఇడ్లీ కొట్టు నడుపుతూ జీవితం నడిపిస్తూంటాడు శివ కేశవులు (రాజ్‌కిరణ్). అతను ఆ ఇడ్లీ కొట్టు ని ప్రాణంగా చూస్తూంటాడు. ఇండ్లీలు ఎంతో రుచిగా వేస్తూంటాడు. ఇక ఆయన కొడుకు మురళీ (ధనుష్)కి చిన్న ఊరు భవిష్యత్తు ఇస్తుందని నమ్మకం లేదు. తన తండ్రి నడుపుతున్న కొట్టుని కాస్త ఫ్రాంచైజీలా మార్చేసి, అదే పేరుతో ఇతర చోట్ల కూడా హోటల్స్‌ని ఏర్పాటు చేసి డబ్బు సంపాదిస్తా అంటాడు. దానికి తండ్రి ఒప్పుకోడు.
దాంతో హోటల్ మేనేజ్మెంట్ చదవడానికి ఊరిని వదిలిపోతానంటాడు. కానీ ఈ నిర్ణయాన్ని అతని తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) అసలు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన కల ఒక్కటే – “ఇడ్లీ కొట్టు” అనే తన చిన్న ఇడ్లీ షాప్‌ను కొడుకు కొనసాగించాలి. కానీ మురళి ఆగడు. ఉన్నవారిని, తల్లి తండ్రులను వదిలి వెళ్ళిపోతాడు. బ్యాంకాక్‌లో సెటిల్ అవుతాడు. అక్కడ చైన్ హోటల్ బిజినెస్ లో కలుస్తాడు.
తన కష్టంతో ఆ బిజినెస్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తాడు. అంతగా మెప్పిస్తాడు కాబట్టి… విష్ణువర్ధన్ తన కూతురు మీరా (షాలినీ పాండే)ను పెళ్లి ఇస్తానని నిర్ణయిస్తాడు. ఇంతలోనే షాక్.
పెళ్లి ముందు రోజుల్లోనే తండ్రి మరణం! దాంతో మురళీ ఇండియాకి తిరిగి వస్తాడు. ఊరిని, తండ్రి కలను మళ్లీ చూసిన తర్వాత… అతని జీవితం మారిపోతుంది. తండ్రి చివరి కోరికను నిలబెట్టుకోవాలనే నిశ్చయంతో… మీరాతో పెళ్లిని రద్దు చేస్తాడు. మరలా ఊరిలో ఉండిపోతాడు. కానీ ఈ నిర్ణయం మీరా అన్నయ్య అశ్విన్ (అరుణ్ విజయ్)కి అస్సలు నచ్చదు. అతని అహంకారం, ఈగో తాకిడి ఊరి గాలినే మార్చేస్తాయి. ఒకసారి ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తగానే… మురళీ కొట్టిన ఒక్క దెబ్బ అశ్విన్ ముఖాన్నే కాదు, అతని అహంకారాన్నీ గాయపరుస్తుంది. అదే అతని ప్రతీకారానికి మొదలు. చివరకు ఏమైంది..
మురళీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకొని ఇడ్లీ కొట్టును మళ్లీ ఊరి గౌరవంగా మార్చగలడా? లేక అశ్విన్ ప్రతీకారం అతని కలల్ని నేలమట్టం చేస్తుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
హీరోగానే కాకుండా దర్శకుడిగానూ ధనుష్ తీసుకొచ్చిన “ఇడ్లీ కొట్టు” (తమిళంలో Idly Kadai) ఒక సింపుల్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది.
తండ్రి మరణం తర్వాత ఊరికి తిరిగి వచ్చి తన రూట్స్‌ను అర్థం చేసుకున్న హీరో—ఈ లైన్ విన్న వెంటనే మనసుకు “స్వదేశ్ షారుఖ్‌ఖాన్ చేసిన ఆత్మబోధ” గుర్తొచ్చేలా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే… ఆ ఎమోషన్ జర్నీ సహజంగా కాకుండా, ఒక తెలుగు/తమిళ టీవీ సీరియల్ ఎపిసోడ్‌లా ప్రెజెంట్ చేయటమే.
దర్శకుడు ధనుష్ ప్రయత్నం
ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ ఈ సినిమా తీసుకున్నాడు. అతని ఉద్దేశం క్లియర్: తండ్రి–కొడుకు బంధం చూపించాలి. ఊరి వాతావరణం, స్థానికత, వారసత్వం మీద ఫోకస్ పెట్టాలి. ఒక పెద్ద ఉద్యోగం vs ఒక చిన్న ఊరి విలువ అనే కాన్ఫ్లిక్ట్ చూపించాలి. కానీ సమస్య – ఈ ఆలోచనలను సినిమాటిక్‌గా ఆర్గానిక్‌గా మలచలేకపోయాడు. సినిమా అంతా చూస్తే, “నిజం” కంటే “డ్రామా” ఎక్కువగా అనిపిస్తుంది.
ఎమోషన్ ఎందుకు వర్కవుట్ కాలేదు?
సన్నివేశాలు బలవంతంగా సెంటిమెంట్ రేపుతున్నట్టే ఉంటాయి. ఎక్కడా సహజ ప్రవాహం కనిపించదు. ఫీలయ్యేలా ఉన్న కొన్ని సన్నివేశాలు కూడా, తర్వాతి సీక్వెన్స్‌లో మెలోడ్రామా వల్ల ప్రభావం కోల్పోతాయి. ఉదాహరణకి – తండ్రి మరణం తర్వాత మురళీ ఊరికి తిరిగి రావడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. కానీ అది లోపలినుంచి పుట్టిన ఆత్మబోధలా కాకుండా, “సీరియల్లో వచ్చే కృత్రిమ ట్విస్ట్”లా అనిపిస్తుంది.
ప్రధాన ఘర్షణ – ఎంత బలహీనంగా?
సినిమా మొత్తం మురళీ vs అశ్విన్ (అరుణ్ విజయ్) ట్రాక్ మీద నడవాలి. కానీ ఈ ఘర్షణ చిన్న పిల్లల గొడవలాగా అనిపిస్తుంది. ఒక దెబ్బతో ముఖం గాయమైపోయిందని, ఇగో తాకిందని, హీరోని పడగొట్టాలి అన్న బలహీన కారణంతోనే విలన్ పాత్ర ముందుకు సాగుతుంది.
పాత్రలు, టెక్నికల్ వర్క్?
ధనుష్, సముద్రకని, పార్థిబన్, నిత్యా మీనన్—ఎవరూ సహజంగా కనిపించరు. డైలాగులు అన్నీ టీవీ సీరియల్ స్టైల్లో ఉన్నాయి. ఒక్క రాజ్‌కిరణ్ మాత్రమే నిజమైన భావోద్వేగాన్ని చూపిస్తాడు కళ్ళతో, నటనతో.
జివి ప్రకాష్ సంగీతం పూర్తిగా మరచిపోవాల్సిందే.జివి ప్రకాష్ మ్యూజిక్ పూర్తిగా బలహీనంగా ఉంది. ఒక సీన్‌కైనా ఎమోషన్ పెంచలేకపోయింది.
సినిమాటోగ్రఫీ సరైన లోకల్ ఫ్లేవర్ చూపించినా, అది సగం వరకు మాత్రమే పనిచేసింది.
ఫైనల్ గా ..
“ఇడ్లీ కొట్టు”లో ఒక మంచి పాయింట్ ఉంది – తండ్రి కల vs కొడుక్కి కల అనే కాన్ఫ్లిక్ట్. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ని బలంగా ప్రెజెంట్ చేయడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. ఎమోషన్ కావాలి, కాని అది సహజంగా పుడితేనే పనిచేస్తుంది. ఇక్కడ ఎమోషన్ అన్నీ కృత్రిమంగా నెట్టినట్టే ఉన్నాయి. ప్లాటింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు 80ల మెలోడ్రామాలో ఇరుక్కుపోయినట్టే ఉంటుంది.
ఏదైమైనా “ఇడ్లీ కొట్టు”—ఫోర్స్డ్ నాస్టాల్జియాలో ఇరుక్కుపోయిన ఓ రుచి పచీ లేని ఇడ్లీ.
