

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఓ లీగల్ డ్రామా కారణంగా ప్లాట్‌ఫారమ్ నుంచి మాయం అయింది!
అసలు సంగతి ఏంటంటే… లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కోర్టు తలుపు తట్టారు. తన అనుమతి లేకుండా సినిమాలో తన పాటలను వాడారని ఆయన ఆరోపించారు. ఇది కాపీరైట్ చట్టానికి వ్యతిరేకమని, వెంటనే వాటిని తొలగించాలని, అలాగే అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. ఇళయరాజా పాటలు సినిమాలో వాడకూడదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతోనే నెట్‌ఫ్లిక్స్ సినిమా లైబ్రరీ నుంచి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలగించబడింది.
ఈ వివాదంపై నిర్మాత రవి రియాక్షన్ ఇచ్చారు. “మేము రిలీజ్‌కి ముందు అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. రూల్స్ ప్రకారం పాటలను వాడాం” అని ఆయన మీడియాకు చెప్పారు. అయితే, ఆ పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. కానీ, అసలు యజమాని ఎవరో వెల్లడించలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్న వారు తగిన పరిహారం చెల్లించాలని తెలిపారు.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే… ఇళయరాజా కాపీరైట్ పవర్ ముందు పెద్ద సినిమా కూడా నిలవలేదనేది!