

సంగీతానికి ఆధ్యాత్మికత కలిసినప్పుడు అది ఇళయరాజా జీవితం అవుతుంది. కెరీర్ ప్రారంభం నుంచి మూకాంబిక అమ్మవారికి అంకితభావంతో పూజలు చేస్తూ వస్తున్న మాస్ట్రో… ఈసారి మరో అద్భుతమైన భక్తి కానుక సమర్పించారు.
ఉడుపి జిల్లా కొల్లూరులోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఇళయరాజా… వజ్రాలతో మెరిసే రూ.4 కోట్ల విలువైన వెండి కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. అంతే కాదు, వీరభద్ర స్వామికి బంగారు కత్తి సమర్పించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఇళయరాజాకు అమ్మవారి తీర్థప్రసాదం, ఫొటో అందించారు.
ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. “నా సంగీత ప్రయాణం, నా జీవితం… ఇవన్నీ అమ్మవారి ఆశీస్సుల వల్లే సాధ్యమయ్యాయి. నేను చేసినది ఏమీ లేదు” అని మాస్ట్రో వినయంగా పేర్కొన్నారు.
‘‘సాధారణ భక్తుడిగానే ఇళయరాజా ఈ ఆలయానికి వస్తుంటారు. అమ్మవారికి 2006లోనూ ఆయన ఓ కిరీటం బహూకరించారు’’ అని మూకాంబిక ఆలయం మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ బాబు శెట్టి తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో… దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి.