సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. అయితే తాజాగా వర్మ తన సినిమాలపై, ముఖ్యంగా రాజమౌళి తనను అడిగిన ఒక పదునైన ప్రశ్నపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ‘సత్య’, ‘శివ’ వంటి క్లాసిక్స్ తీసిన వర్మ.. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాడో జక్కన్న నిలదీసిన తీరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
రాజమౌళి అడిగిన ఆ పదునైన ప్రశ్న ఏంటి?
చాలా కాలం క్రితమే రాజమౌళి వర్మను ఒక ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్నించారు. “మీ అంత తెలివైన వ్యక్తికి, సినిమా టెక్నాలజీపై ఇంత పట్టున్న మనిషికి.. ఇలాంటి చీప్ గిమ్మిక్కులు, సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది?” అని రాజమౌళి అడిగారు. అప్పట్లో వర్మ తన స్టైల్‌లో ఏదో ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నా, ఇప్పుడు మాత్రం ఆ ప్రశ్న తనను వెంటాడుతోందని వర్మ స్వయంగా ఒప్పుకున్నారు.
నేను చేసింది తప్పే.. వర్మ షాకింగ్ నిజాలు!
గత ఐదేళ్లుగా తాను తీసిన సినిమాలపై వర్మ ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. వర్మ మాట్లాడుతూ… “నేను ‘నాచ్’ (Naatch) సినిమాను చూసినప్పుడు.. నేను ముందే చెప్పాను.. అది చాలా ఆసక్తికరమైన సినిమా. అది ‘ఫౌంటెన్‌హెడ్’ (Fountainhead) నుంచి ప్రేరణ పొంది తీసినది. ఏదో కొత్త విషయాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తి చేసిన పని అది. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని ఒక ట్విస్ట్‌తో చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక మగాడి పాత్రను ఆడదానిగా మార్చి.. ఆమె తన సిద్ధాంతాలకు చాలా కట్టుబడి ఉండేలా చూపించారు. ఆమె దేనికీ రాజీ పడదు, అది ఆమె చుట్టూ ఉన్నవారికి చిరాకు కలిగిస్తుంది.
గత ఐదేళ్లలో వచ్చిన నా సినిమాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే.. ‘సత్య’ లాంటి సినిమా తీసిన దర్శకుడు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అని. నేను ఒక జోన్‌లో ఉండి ఆ సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను, ఆ సినిమాలు నేను చేసి ఉండకూడదు. మహిళలను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నట్లు కనిపించే సినిమాలను కూడా పూర్తి సిన్సియారిటీతో తీయవచ్చు. కానీ నేను అలా చేయలేదు. మనలో నుంచి వచ్చే సిన్సియారిటీతో, మనం ఏ ఎమోషన్‌ను చూపిస్తున్నామో దానికి గౌరవం ఇచ్చి సినిమా తీయాలి. అది నేను చేయలేదు, నేను అలా చేయడం లేదన్న విషయం అప్పుడు నాకు తెలియదు అన్నారు.
నేను చాలా అజాగ్రత్తగా ఉండే వ్యక్తిని. నన్ను నేను సీరియస్‌గా తీసుకోను, దేన్నీ సీరియస్‌గా తీసుకోను. షాక్ వాల్యూ కోసం లేదా గిమ్మిక్కుల కోసం ఏదైనా చేసే ధోరణి నాకు ఉంది.
అలాగే ‘క్షణం క్షణం’ ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆ సినిమాను నేను చాలా నమ్మాను. అప్పుడు నాకనిపించింది.. ఒకవేళ ‘శివ’ ఆక్సిడెంటల్‌గా హిట్ అయిందేమో అని. నాకు నచ్చిన సినిమా ఫ్లాప్ అయి, మరొకటి హిట్ అయితే అసలు ఏది వర్కవుట్ అవుతుందో నాకు తెలియదు అనిపించింది. అందుకే అప్పటి నుండి నాకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లాను. ‘సర్కార్’ వంటి సినిమాలు కూడా అలా వచ్చినవే.
‘సత్య’ తర్వాత నేను ‘కౌన్’ (Kaun) సినిమా తీశాను. ఒక అమ్మాయి, బెల్ కొట్టే వ్యక్తి.. ఇలా ఒక ఇంట్లో జరిగే థ్రిల్లర్ అది. ఆ ఐడియా నాకు నచ్చి చేశాను. కానీ అప్పుడు ఎవరైనా నన్ను అడిగి ఉంటే.. ‘సత్య’లో అండర్ వరల్డ్ లోకి తీసుకెళ్లి ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చావు కదా, మరి ‘కౌన్’ ఏం ఇస్తుంది? అని.. బహుశా నేను ఆ సినిమా చేసి ఉండేవాడిని కాదు.
గత 5-10 ఏళ్లలో నేను తీసిన సినిమాల గురించి కూడా నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు, అది నాకే భయం కలిగిస్తోంది. ఏదైనా సినిమా తీసే ముందు ‘సత్య’ను ఒకసారి చూసి.. అది ఇలాంటి ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వగలదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సినిమా ఏదైనా సరే.. గిమ్మిక్కీగా మాత్రం మారకూడదు.” అని చెప్పుకొచ్చారు.
సత్య – ది బెంచ్ మార్క్!
ఏ సినిమా తీసే ముందైనా ఒక్కసారి ‘సత్య’ సినిమాను చూసుకోవాలని, అప్పుడే మనం తీసే సినిమాలో దమ్మెంతో అర్థమవుతుందని వర్మ చెప్పుకొచ్చారు. సినిమా ఏదైనా సరే, అది ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి తప్ప.. కేవలం షాక్ వాల్యూ కోసమే తీయకూడదని వర్మ ఇప్పుడు రియలైజ్ అయ్యారు.
మొత్తానికి జక్కన్న వేసిన ప్రశ్న వర్మలో మార్పు తెచ్చిందో లేదో గానీ, ఈ విశ్లేషణ మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

