తన ఫ్యాన్స్ తనపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు నటి సమంత (Samantha). వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. చెన్నై వేదికగా ఇటీవల జరిగిన బిహైండ్‌వుడ్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న అనంతరం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమంత మాట్లాడుతూ..‘‘ఈ అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కె.బాలచందర్ సర్ పేరుతో ఈ అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను మనకు పరిచయం చేశారు. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో స్త్రీ పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి. ఆయన సినిమాల నుంచి నేనెంతో స్ఫూర్తి పొందా.
ఈరోజు నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తుంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినవారందరికీ ధన్యవాదాలు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే మనల్ని ప్రేమించేవారు ఉంటారు. కానీ, రెండేళ్లు అయింది ఒక్క తమిళ సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో హిట్ అందుకోలేదు. అయినా నాపై మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.
మీ ప్రేమను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో కూడా నాకు తెలియదు. మీరు లేకుండా నేను లేను’’ అని ఆమె చెప్పారు.
అభిమానులు డ్యాన్స్ చేయమని కోరగా.. తాను ఇప్పుడే యాక్షన్ సీక్వెన్స్ చేసి వచ్చానని.. డ్యాన్స్ చేయలేనని తెలిపారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని అన్నారు.