ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపాయి. మథురైలో బీజేపీ నిర్వహించిన “మురుగన్ మానాడు” కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు – ముఖ్యంగా నాస్తికులు, సెక్యులరిస్టులపై కామెంట్స్ – ఇప్పుడు తమిళనాట విపరీతంగా చర్చగా మారాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్, పవన్ కళ్యాణ్‌ను ఖరాఖండిగా హెచ్చరించారు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు, పవన్‌ని నేరుగా టార్గెట్ చేశారు.

విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీకేసీ) పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భంలో సత్యరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా, తమిళ ప్రజల గురించి మాట్లాడే ముందు వారి చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసుకోవాలని పవన్‌కి సూచించారు.

ఇంతకుముందే డీఎంకే నేతలు కూడా పవన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ, “తమిళ రాజకీయాల్లో జోక్యం చెసుకోవద్దు. అసలు తమిళనాడుతో మీకేం సంబంధం? ఇంత ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి” అంటూ పవన్‌కి సవాల్‌ విసిరారు.

ఇవన్నీ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో కేవలం రాజకీయంగా కాక, సాంస్కృతికంగా కూడా ఉద్రిక్తతను రేపినట్లు స్పష్టమవుతోంది. ఇక సత్యరాజ్ వంటి సీనియర్ నటుడు ఇలా గట్టిగా స్పందించడం, పవన్ పాలిట రాజకీయంగా ఏమైనా కొత్త సమస్యని తెస్తుందా అన్నది చూడాల్సిందే.

, ,
You may also like
Latest Posts from