రాజు (ప్రభాస్)కి తన నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) కలిసి ఉంటూంటాడు. ఆమె ఎప్పుడూ తనను ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని తలుచుకుంటూ ఉంటుంది. దానికి తగినట్లు ఆమెకు అల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. దాంతో తన తాత ను సాధ్యమైనంత త్వరలో వెతికి తీసుకువచ్చి ఆనందపరచాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని అదృష్టం కొద్ది హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వల్ల తాత ఆచూకి లభిస్తుంది. దాంతో అర్జెంట్ గా ఓ బ్యాగ్ భుజాన వేసుకుని హైదరాబాద్ బస్ ఎక్కేస్తాడు. అలా వెళ్లిన అతనికి పరిచయమైన ఓ అమ్మాయి(మాళవిక మోహన్) వల్ల తన తాత నర్సాపూర్ దగ్గర అడవుల్లో ఉన్నాడని అర్దమవుతుంది. దాంతో అక్కడికి ప్రయాణమవుతాడు.
అయితే అక్కడకి వెళ్లేసరికి తన తాత గురించి ఓ షాకింగ్ గతం, నిజం తెలుస్తుంది. దాంతో తన తాత తను అనుకున్నంత మంచివాడు కాదని అర్దమై, అతన్ని అంతం చేయాలనుకుంటాడు. అసలు అతని తాత ఎవరు, అతని గతం ఏమిటి. మధ్యలో మాయలు, మంత్రాలు,హిప్నానిజం వంటి విషయాలకు ఉన్న ప్రధాన్యత ఏమిటి..రాజా తన తాతను కలుసుకున్నాడా.కలుసుకున్నాక ఏం జరిగింది. తన తాత గతం ఏమిటి.. చివరకు తన నాయనమ్మకు తన తాతను తీసుకెళ్ల గలిగాడా ఏమైంది, ఈ క్రమంలో అతనికి పరిచయమ్యే అమ్మాయిలు (రిద్ది, నిధి అగర్వాల్)పాత్రలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
ద్రోహం, హిప్నటిజం, రివెంజ్, తరాల ట్రామా… పేపర్ మీద ఇది ఓ ఆధునిక “చందమామ కథ”లా వినిపిస్తుంది. దుష్టుడు తంత్ర శక్తులతో రాణిని మోసం చేసి, సంపద దోచుకుని, ఆమెను నాశనం చేస్తాడు. ఏళ్ల తర్వాత మనవడు నిజం తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇలా కాన్సెప్ట్ బలంగా ఉన్నా… స్క్రీన్‌పై అమలు పూర్తిగా ఫెయిల్.
ఈ సినిమాలో కథ వర్కవుట్ కాకపోవటానికి కారణం ఏ పాత్రకూ స్పష్టమైన ఎదుగుదల లేదు. భావోద్వేగాలు ఉపరితలంలోనే ఆగిపోతాయి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో: అనవసరమైన రొమాన్స్, గ్లామర్ షాట్స్ ,పాత ఫార్ములా ఫైట్స్. కథ ముందుకు వెళ్లదు, సీన్స్ లాగుతూనే ఉంటాయి.
ఇక సత్యతో వచ్చే ఓపెనింగ్ మిస్టిక్‌గా ఆసక్తిని రేపుతుంది. కానీ వెంటనే ప్రభాస్ ఇంట్రో సాంగ్, హీరోయిన్ ట్రాక్స్, పాత హ్యూమర్‌తో సినిమా రొటీన్‌లోకి జారిపోతుంది. ఇంటర్వల్‌లో సంజయ్ దత్ ఫ్లాష్‌బ్యాక్ మాత్రమే కాస్త హోప్ ఇస్తుంది. మిగతా ఫస్ట్ హాఫ్ – బోర్.
సెకండాఫ్ కు వచ్చేసరికి భూతాల ఇల్లు, ఫాంటసీ ప్రపంచం, రివెంజ్ డ్రామా… ఇక్కడే సినిమా లేచే ఛాన్స్. కానీ: హారర్ వర్క్ కాలేదు. కామెడీ క్రింజ్, పాటలు కథను ఆపేస్తాయి. స్టోరీ వరల్డ్ నమ్మకం కలిగించదు. బోమన్ ఇరానీ ఎపిసోడ్, ప్రీ–క్లైమాక్స్, క్రోకడైల్ సీన్, క్లైమాక్స్ తప్పితే చెప్పుకోదగ్గదేమీ లేదు. “నానమ్మ ఎమోషన్”గా ఉండాల్సిన కోర్ కూడా కనెక్ట్ కాలేదు.
VFX ఐడియాలు క్లైమాక్స్‌లో బాగానే ఉన్నా, అంతకుముందు వచ్చిన బోర్ వల్ల వాటిని ఆస్వాదించే మూడ్ ఉండదు. మంచి ఐడియా, చెత్త ఎగ్జిక్యూషన్. పాత కాలం నాటి కామెడీ, క్రింజ్ ట్రాక్స్, ఫోకస్ లేని డైరెక్షన్ కలిసి సినిమాను మిస్‌ఫైర్ చేశాయి.
టెక్నికల్ గా…
సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, కొన్ని VFX షాట్స్ చూడటానికి బాగుంటాయి. కానీ కథ చెప్పడంకంటే గ్రాఫిక్స్‌పై ఎక్కువగా ఆధారపడటం సినిమాకి మైనస్ అయ్యింది. సంగీతం సోసోగా ఉంది. పాటలు పెద్దగా వర్కవుట్ కాలేదు. చూడటానికి బాగోలేవు. కెమేరా వర్కు బాగుంది. దాదాపు రూ.400 కోట్లు ఖర్చయ్యాయని, మూడు సంవత్సరాలు తీసుకున్నారని చెప్పుకుంటే… చివరికి వచ్చిన ఫలితం ఆ స్థాయికి సరిపడినట్టు అనిపించదు.
ప్రభాస్ స్టైలిష్‌గా, కూల్‌గా కనిపిస్తారు. కానీ ఆయన పాత్ర సరిగా రాయలేదు. స్టార్ హీరోకి ఉండాల్సిన ఎమోషన్, ఎలివేషన్ ఇక్కడ కనిపించదు. కొన్ని సీన్లలో బాడీ డబుల్ వాడినట్టు స్పష్టంగా అనిపిస్తుంది – దాంతో ఇమర్షన్ బ్రేక్ అవుతుంది. ఇంకా పెద్ద సమస్య డైలాగ్ డెలివరీ. కొన్ని డైలాగ్‌లు స్పష్టంగా వినిపించవు, వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగాలేదు. ఇది డబ్బింగ్ లేదా టెక్నికల్ ఎంపికలపై సందేహాలు కలిగిస్తుంది.
హీరోయిన్లలో మాళవిక మోహనన్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంది, ఒక యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. కానీ ఆమె పాత్రకు డెప్త్ లేదు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లను సరైన విధంగా ఉపయోగించలేదు. వాళ్లు కథకు ఉపయోగపడే పాత్రలుగా కాకుండా, ఎక్కువగా గ్లామర్ కోసం మాత్రమే కనిపిస్తారు.
ఏదైమైనా…
‘ది రాజాసాబ్’ భారీ అంచనాలతో వచ్చిన సినిమా… కానీ ఎగ్జిక్యూషన్‌లో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు మారుతి ప్రభాస్ లాంటి స్టార్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. హారర్, కామెడీ, ఫాంటసీ, ఎమోషన్‌లను బ్యాలెన్స్ చేయడంలో కూడా విఫలమయ్యాడు. ఫలితంగా సినిమా బోరుగా, చాలా లెంగ్తీగా, ఆత్మలేని కథలా మారింది.
మంచి కాన్సెప్ట్, స్టార్ పవర్ ఉన్నా… బలహీనమైన రైటింగ్, లోతులేని పాత్రలు, నెమ్మదైన నెరేషన్ సినిమా స్థాయిని దిగజార్చాయి. కేవలం క్లైమాక్స్‌లో కొంచెం ఆసక్తి కలిగించే భాగం తప్ప, మెచ్చుకోదగ్గది పెద్దగా ఏమీ లేదు. మొత్తంగా ‘ది రాజాసాబ్’ ప్రభాస్ అభిమానులకు కూడా నిరాశే కలిగిస్తుంది. వినోదం ఇవ్వాల్సిన సినిమా, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమాగా మారింది.

