యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఏప్రిల్ 26న తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అతని ఎదుట సమస్యగా నిలబడ్డాయి. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారంటూ గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అసలు ఏం జరిగిందంటే…

ఈవెంట్‌లో మాట్లాడిన విజయ్, పహల్గాం ఉగ్రదాడి గురించి వ్యాఖ్యానిస్తూ —

“ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి,” అని అన్నాడు.

విజయ్‌ ఉపయోగించిన “ట్రైబల్స్” అనే పదమే ఇక్కడ వివాదానికి కేంద్రబిందువైంది. ఇది గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చినట్లయ్యిందని ఆరోపిస్తూ సంఘం నాయకుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంటనే స్పందించిన విజయ్‌…

వివాదం మొదలగగానే విజయ్ తన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చాడు.

“ట్రైబల్స్ అనే పదాన్ని వాడిన మాట నిజమే. కానీ నేను ఉద్దేశించినది ప్రాచీన కాలంలో ప్రజలు వర్గాలుగా ఉండే సమాజాన్ని మాత్రమే. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ గురించి కాదు. అయినా ఎవరికైనా నా మాటల వల్ల హర్ట్ అయితే, చింతిస్తున్నాను,” అంటూ స్పందించాడు.

, ,
You may also like
Latest Posts from ChalanaChitram.com