సినిమా వార్తలు

‘ధురంధర్’ ని అడ్డం పెట్టి వర్మ టాప్ డైరెక్టర్లపై ఘాటు సెటైర్స్!

వివాదాలు, వైరల్ కామెంట్స్ అంటే రామ్ గోపాల్ వర్మ పేరు ఆటోమేటిక్‌గా గుర్తుకొస్తుంది. ఏదో ఒక సంఘటననో, లేక సినిమానో , లేక మరొకటో అడ్డం పెట్టుకుని సెటైర్స్ వేస్తూంటారు. ఈసారి కూడా అదే స్టైల్‌లో వర్మ ఇండస్ట్రీపై సెటైర్స్ విసిరారు. అడ్డం పెట్టుకున్నది ఒక్కటే సినిమా — దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ‘ధురంధర్ . ఆ సినిమాను పొగిడుతూ, పెద్ద బడ్జెట్‌లు, భారీ హైప్‌లతో సినిమాలు చేసే టాలీవుడ్–బాలీవుడ్ టాప్ డైరెక్టర్లను పరోక్షంగా టార్గెట్ చేశారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లు ‘ధురంధర్’ పేరు ఎత్తడానికే వెనకాడుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు. అది అవమానమో, నిర్లక్ష్యమో కాదని… ఆ సినిమా స్థాయికి తాము చేరుకోలేమన్న లోపలి భయమే కారణమని ఆయన సెటైర్ వేశారు. ఒక గొప్ప సినిమా వచ్చినప్పుడు దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, మౌనంగా ఉండటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంటూ ఇండస్ట్రీ తీరు మీద గుచ్చి గుచ్చి మాట్లాడారు.

తన మాటలకు మరింత మసాలా జోడిస్తూ వర్మ ఒక చమత్కారమైన పోలిక వేశారు. ఎవరి ఇంటికైనా వెళ్తే అక్కడ పెద్దగా, భయంకరంగా కనిపించే కుక్క ఉంటే… ‘ఏమీ చేయదు’ అని యజమాని చెప్పినా మన కళ్ళు మాత్రం ఆ కుక్క మీదే ఉంటాయని అన్నారు. అదే విధంగా ఇప్పుడు ప్రతి పెద్ద సినిమా ఆఫీస్‌లో ‘ధురంధర్’ అనే పేరు ఒక భయపెట్టే కుక్కలా తిరుగుతోందని… బయట మాట్లాడరు కానీ లోపల మాత్రం అదే సినిమా టెన్షన్‌గా ఉందని వర్మ వ్యాఖ్యానించారు.

కేవలం భారీ సెట్లు, ఖరీదైన వీఎఫ్ఎక్స్, ఐటమ్ సాంగ్స్, హీరో ఎలివేషన్లతో సినిమాలు నడిపించాలని అనుకునే దర్శకులకు ‘ధురంధర్’ ఒక హారర్ ఫిల్మ్‌లా మారిందని వర్మ చురకలు అంటించారు. హీరోలను దేవుళ్లలా చూపించడం కాదు, సినిమానే హీరో కావాలన్న ఆలోచనను ఈ సినిమా గట్టిగా నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాదని, గత అరవై ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధికంగా చర్చకు వచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వర్మ కొనియాడారు. వర్మ చేసిన ఈ సెటైర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు ఆయన మాటలకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం మరోసారి ఇండస్ట్రీని రెచ్చగొట్టడానికే వర్మ ఇలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.

Similar Posts