సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవిపై ఇళయరాజా కేసు? క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) సినిమాతో వింటేజ్ చిరును వెండితెరపై చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అటు అనిల్ రావిపూడి తన కెరీర్‌లో వరుసగా 9వ హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 85 కోట్లు వసూలు చేసి రికార్డులు తిరగరాస్తోంది.

అయితే, ఇంతటి సక్సెస్ ఆనందంలో ఉన్న మెగా టీమ్‌కు ఒక టెన్షన్ మొదలైంది. అదే ‘సుందరి కన్నాల్ ఒరు సేది’ సాంగ్ వివాదం!

అసలు భయం ఏంటంటే?

ఈ సినిమాలో చిరు – నయనతార మధ్య వచ్చే రొమాంటిక్ సీక్వెన్స్‌లో మణిరత్నం ‘దళపతి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘సుందరి’ని వాడారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ పాటను పర్మిషన్ లేకుండా వాడితే ఆయన ఊరుకోరని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి సినిమాలపై ఆయన లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో, మెగాస్టార్ సినిమాపై కూడా ఇళయరాజా కేసు వేస్తారేమో అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ:

ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “చాలామంది ఇళయరాజా గారు కేసు వేస్తారని భయపడుతున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. ఏదైనా వాడేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలి. మా నిర్మాతలు పర్సనల్‌గా ఇళయరాజా గారిని కలిసి విషయం చెప్పారు. చిరంజీవి గారి సినిమా కోసం వాడుతున్నామని అడగ్గానే ఆయన ఎంతో సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాం కాబట్టే ఈ పాటను పెట్టాం” అని అనిల్ స్పష్టం చేశారు.

దీంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చట్టపరమైన చిక్కులేవీ లేకుండానే ‘సుందరి’ పాట చిరు సినిమాలో మ్యాజిక్ క్రియేట్ చేస్తోందని తేలిపోయింది. చిరు-వెంకీ కాంబో రచ్చకు తోడు, ఈ క్లారిటీ రావడంతో థియేటర్ల వద్ద మెగా సందడి మరికొన్ని రోజులు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Similar Posts