బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వరస ఫెయిల్యూర్ తర్వాత చేసిన పఠాన్ తో మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో నటించే పాత్ర కోసం ఈ అగ్ర నటుడు మార్వెల్ స్టూడియోస్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. మార్వెల్ స్టూడియోస్ తో షారుఖ్ ఖాన్ బృందం చర్చలు జరుపుతోంది. ఇదే జరిగితే, అంతర్జాతీయ సూపర్ హీరో ఫ్రాంచైజీలో నటించిన మొదటి ఇండియన్ నటుడు షారుఖ్ ఖాన్ అవుతాడు.
మార్వెల్ స్టూడియోస్ అనేక సూపర్ హీరో చిత్రాలను తయారు చేస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో షారుఖ్ ఖాన్ పాత్ర గురించి ఇప్పటికి అయితే బయిటకు రాలేదు. అలాగే ఇప్పటిదాకా షారుఖ్ ఖాన్ లేదా మార్వెల్ స్టూడియోస్ నుండి అధికారిక ప్రకటన లేదు.
షారూఖ్ తన తదుపరి చిత్రం కింగ్ షూటింగ్ ఈ ఏడాది మే నుండి ప్రారంభించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కాగా సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో షారుఖ్‌కి మంచి మార్కెట్ ఉంది. అయితే షారుఖ్ హాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటారు. కానీ ఇప్పటివరకు ఆ అదృష్టం అయితే దక్కలేదు.
అయితే ఆ మధ్యన షారుఖ్‌ని అవెంజర్స్ సూపర్ హీరోగా చూడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు హాలీవుడ్ నటుడు ఆంతోనీ మాక్. ఆంథోనీ మాకీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని కెప్టెన్ అమెరికా చిత్రాలలో సూపర్ హీరోగా అలరించాడు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నెక్స్ట్ అవెంజర్‌ని బాలీవుడ్ నుంచి తీసుకోవాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటారు అంటూ మాకీని అడుగగా.. మాకీ సమాధానమిస్తూ.. షారుఖ్ ఖాన్ అని చెప్పాడు. షారుక్ అయితే నెక్స్ట్ అవెంజర్‌గా సెట్ అవుతాడు. అతడిని సూపర్ హీరోగా చూడడం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.