
‘అనగనగా ఒక రాజు’ హిట్ కోసం నాగవంశీ పెద్ద స్కెచ్ వేసాడే!
సంక్రాంతి రేసులో నవీన్ పోలిశెట్టి ‘రాజు’గా వస్తున్నాడు.. థియేటర్లు నవ్వులతో దడదడలాడటం ఖాయమేనా?
టాలీవుడ్‌లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున వినిపించే పేరు నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నుంచి ‘జాతి రత్నాలు’ వరకు తను స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులు పూయాల్సిందే. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ టాలెంటెడ్ హీరో ‘అనగనగా ఒక రాజు’ అంటూ 2026 సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.
సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వినోదం కోరుకుంటారు, అందులోనూ నవీన్ సినిమా వస్తుందంటే ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్న నేపథ్యంలో, నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవీన్ పోలిశెట్టి మార్క్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండటంతో గ్లామర్ పరంగా కూడా హైప్ పెరిగింది. సంక్రాంతికి మాస్ యాక్షన్ సినిమాలు ఎన్ని ఉన్నా, ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమాలు ఎప్పుడూ అడ్వాంటేజ్ పొందుతాయి.
ఈ క్రమంలోనే ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి క్లీన్ ఎంటర్‌టైనర్ అనే ముద్ర పడటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ఎసెట్ కాగా, డైరెక్టర్ మారి ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ ఫన్ రైడ్‌లా తీర్చిదిద్దినట్లు సమాచారం.
సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించే రన్ టైమ్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండటం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేటి కాలంలో క్రిస్పీ రన్ టైమ్ ఉండటం సినిమాకు పెద్ద వరమనే చెప్పాలి.
మొదటి రెండు గంటల పాటు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించి, చివరి 15 నిమిషాల్లో ఒక బలమైన ఎమోషన్‌తో గుండె బరువుగా చేసి థియేటర్ నుండి బయటకు పంపేలా కథను డిజైన్ చేశారట. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ ‘రాజు’ బాక్సాఫీస్ వద్ద మిగిలిన పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఏ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో చూడాలి.
