సినిమా సమీక్షలు

‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ

కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న విష్ణు( శ్రీ విష్ణు) జాతకాలు, జ్యోతిష్యం పిచ్చి ఎక్కువ. ప్రతీ చిన్న విషయానికి జాతకం చూసుకోనిదే ముందుకు వెళ్ళడు. అలాంటి అతను కాలేజీలో మనీషా(నయన్‌సారిక) అసెస్టెంట్ గా చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి దాకా వెళ్ళతాడు. అయితే అంతా సెట్ అయ్యిందనుకునే సమయానికి ఆమె జాతకం గురించి ఓ విషయం తెలుస్తుంది. ఆమె జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉంటాయి. మొదట పెళ్లి చేసుకున్న అతను పెళ్ళైన 6 నెలలకి ఆమె భర్త చనిపోతాడు. దీంతో విష్ణు డైలమోలో పడిపోతాడు. ఇప్పుడేం చేయాలి. ముందుకు వెళ్లాలా, ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలా…ఇప్పుడేం చేయాలి..ఏం చేస్తాడు అనేదే మిగతా సినిమా.

విశ్లేషణ

ఇప్పటి తెలుగు యంగ్ హీరోలలో ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్‌లో మాత్రమే నవ్వించడం కాదు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే కంటెంట్ ఇవ్వాలనే ప్రయత్నం. డైలాగ్ థియేటర్‌లో పనిచేయాలి… అదే డైలాగ్ రేపు రీల్స్‌లో కూడా తిరగాలి — ఈ ఆలోచనతోనే చాలా కామెడీ సన్నివేశాలు రాస్తున్నారు. విశ్వక్ సేన్, శ్రీ విష్ణు వంటి హీరోలు ఈ ఫార్మాట్‌ను బాగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీ విష్ణు తనకు ప్రత్యేకమైన కామెడీ స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. నేరుగా బూతులు కాకుండా, డబుల్ మీనింగ్ వచ్చేలా పలికే అతని డైలాగులు Gen-Z ప్రేక్షకులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయి. విష్ణు విన్యాసంలోనూ అదే ప్రయత్నం చేసారు. అయితే ప్రతీసారీ ఫలించదు కదా…ఈ సారి రివర్స్ అయ్యింది.

ఇక సినిమా మొత్తం చూస్తే ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది — ఈ సినిమా కథ కోసం హీరో కాదు, హీరో కోసం కథ రాసినట్టుగా ఉంటుంది. శ్రీ విష్ణు ఉన్నంత వరకు సీన్స్ ఎంజాయబుల్‌గా అనిపిస్తాయి. కానీ అతన్ని పక్కన పెట్టి కథ, కథనాలను గమనిస్తే లెక్కలేనన్ని లోపాలు కనిపిస్తాయి. అసలు కథ ఉందా అన్న డౌట్ కూడా వస్తుంది.

సినిమా మొత్తం ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంది — “జాతకం”. తెలుగు సినిమాల్లో ఈ కాన్సెప్ట్ కొత్తది కాదు. గతంలో కూడా ఇలాంటి నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అక్కడ పాయింట్ కథను నడిపేది. ఇక్కడ మాత్రం అది కేవలం సన్నివేశాలు తయారు చేయడానికి ఉపయోగించిన సాధనంగా మాత్రమే కనిపిస్తుంది. అందుకే సినిమా చూస్తూ “ఈ చిన్న పాయింట్ కోసం ఇంత సాగదీసారా?” అనే భావన వస్తుంది.

దర్శకుడు యదునాథ్ మారుతి రావు ప్రధానంగా శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్, వన్-లైన్ పంచ్‌ల మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రతి కొద్ది నిమిషాలకు ఒక కామెడీ బీట్ రావాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రారంభంలో ఈ హ్యూమర్ బాగా పనిచేస్తుంది. కానీ అదే బీట్ మళ్లీ మళ్లీ రావడంతో రిపిటేషన్ ఫీల్ కలుగుతుంది. కామెడీకి కూడా స్ట్రక్చర్ అవసరం — సెటప్, బిల్డ్, పేఆఫ్. ఇక్కడ సెటప్ బాగుంటుంది, కానీ పేఆఫ్ బలహీనంగా ఉంటుంది. అందుకే ప్రేక్షకుడు నవ్వుతాడు కానీ సంతృప్తి చెందడు.

ఇంటర్వెల్ వరకు సినిమా సరదాగా సాగుతుంది. అప్పటివరకు ప్రేక్షకుడికి ఒక ప్రశ్న ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సమయంలో స్క్రీన్‌ప్లే బలహీనపడుతుంది. డ్రామా వైపు వెళ్లే ప్రయత్నం కనిపించినా, పాత్రలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడకపోవడంతో ప్రభావం కనిపించదు. కథలో స్టేక్స్ తక్కువగా ఉండటం, హీరోయిన్ క్యారెక్టర్ బలంగా డెవలప్ కాకపోవడం వల్ల క్లైమాక్స్ కూడా ప్రభావం చూపలేకపోతుంది.

నటీనటుల్లో …

శ్రీ విష్ణు తన సిగ్నేచర్ కామెడీ టైమింగ్‌తో సినిమా మొత్తాన్ని మోస్తాడు; మంచి స్క్రిప్ట్ ఉంటే ఇంకా బాగా కలిసొచ్చేది. కానీ బలహీన రచన-దర్శకత్వం వల్ల అతని ప్రయత్నం పూర్తిగా ఉపయోగపడలేదు. నయనా సారిక స్క్రీన్‌పై ఓకే అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్ట్ లు ఓకే అనిపిస్తారు. సత్య ఉన్నంతలో బాగానే నవ్వించారు.

టెక్నికల్ గా ..

సంగీతం సినిమాకు పెద్దగా హెల్ప్ కాలేదు; పాటలు స్పార్క్ ఇవ్వలేదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథకు ఎనర్జీ తీసుకురాలేకపోయింది. సాయి శ్రీరామ్ కెమెరా, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించినా ప్రత్యేకంగా మెరిపించలేదు. రన్‌టైమ్ చిన్నదే అయినా కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ కట్టుదిట్టంగా లేకపోవడంతో కామెడీ సీన్లు లాగిన ఫీలింగ్ వచ్చి సినిమా నెమ్మదిగా అనిపిస్తుంది.

ఫైనల్ గా

ఈ సినిమాని ఒక్కసారి టైమ్‌పాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడొచ్చు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేది కథ కాదు… శ్రీ విష్ణు కామెడీ మాత్రమే.

Similar Posts