అడివి శేష్ ‘డకోయిట్’ టీజర్ రాగానే టాలీవుడ్‌లో ఒకటే హోరు.. అదే పాత పాట ‘కన్నెపిట్టరో’ రీమిక్స్! కానీ, సీన్ కట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. పర్మిషన్ తీసుకోకుండా నా పాటను ఎలా వాడతారు అంటూ రచ్చ చేయడంతో మేటర్ సీరియస్ అయింది. ఈ గొడవ ముదిరి పాకాన పడకముందే నిర్మాత సుప్రియ రంగంలోకి దిగింది. ఏకంగా కోటి ఇంటికే వెళ్లి అసలు గుట్టు విప్పేసింది!
పాత పాటలను రీమిక్స్ చేసి క్యాష్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్. కానీ, ఒరిజినల్ మేకర్స్‌ను పట్టించుకోకపోతే గొడవలు ఎలా ఉంటాయో ‘కన్నెపిట్టరో’ సాంగ్ విషయంలో రుజువైంది. తనను అవమానించారని కోటి ఆవేదన వ్యక్తం చేస్తే, సుప్రియ మాత్రం చాలా కూల్‌గా కౌంటర్ ఇచ్చింది. తాము లీగల్‌గా అన్నీ క్లియర్ చేసుకున్నామని, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ రచ్చ జరిగిందని ఆమె వివరించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.
మైండ్ బ్లాక్ అయ్యే క్లారిటీ :
సుప్రియ వెల్లడించిన దాని ప్రకారం, ఆ పాట ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ దగ్గర ఉన్నాయి. తాము ఆ సంస్థ నుంచి అధికారికంగా ఎన్ఓసిలు, పర్మిషన్లు తీసుకున్నాకే టీజర్‌లో వాడాము. అయితే ఈ విషయం కోటి కి తెలియకపోవడంతో ఆయన బాధపడ్డారు. కోటి వ్యాఖ్యలు తెలిసిన వెంటనే సుప్రియ ఆయన ఇంటికి వెళ్లి, ప్రాసెస్ అంతా వివరించి అసలు విషయం చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
రైట్స్ కంటే గౌరవం ముఖ్యం:
“మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలను పబ్లిషర్లకు అమ్మేసిన తర్వాత సాంకేతికంగా వారికి ఎలాంటి హక్కులు ఉండవు” అని సుప్రియ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అయితే పాటను సృష్టించిన మనిషిగా గౌరవించడం కనీస ధర్మమని, అందుకే ఆయన ఇంటికి వెళ్లి కలిశానని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కోటి, సుప్రియ కలిసి నవ్వుకుంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు.
ఏది ఏమైనా ‘డకోయిట్’ సినిమాకు ఈ వివాదం వల్ల కావాల్సినంత హైప్ వచ్చేసింది. హక్కులు లేకపోయినా, సృజనకారుల మనోభావాలను పట్టించుకోకపోతే ఇలాంటి తలనొప్పులు తప్పవని సుప్రియ నిరూపించింది. మొత్తానికి ‘కన్నెపిట్టరో’ రచ్చకు ఇప్పుడు తెరపడింది!

