బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టి ‘దురంధర్ 2’ సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు థియేటర్ల నుండి నేరుగా ఎగ్జామ్ హాల్స్‌లోకి దూసుకెళ్లింది. రణవీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ఈ మూవీ మేనియా ఎంతలా పాకిందంటే.. ఏకంగా అకౌంట్స్ క్వశ్చన్ పేపర్‌నే ఈ సినిమా క్యారెక్టర్లతో నింపేశారు. స్టూడెంట్స్ పరీక్ష రాయాలా లేక సినిమా చూసి విజిల్స్ వేయాలా అన్నంతగా వైరల్ అవుతున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం క్యారెక్టర్లే కాదు, సినిమాలో జరిగిన మరణాలను కూడా పక్కాగా లెక్కల్లో వాడటం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

హంజా అలియాస్ రణవీర్ ఎంట్రీ!
సోషల్ మీడియా యూజర్ @vidhzverse షేర్ చేసిన ఈ క్వశ్చన్ పేపర్‌లో హంజా అలీ మజారీ, రెహ్మాన్ డకైత్, ఉజైర్ బలోచ్ వంటి పాత్రల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అకౌంట్స్ టీచర్ సినిమాకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే.. జమీల్ జమాలీ, ఎస్పీ చౌదరి అస్లాంల మధ్య ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత అంటూ ప్రశ్నలు అడిగేశారు. సాధారణంగా ఎ, బి, సి అని పిలిచే లెక్కల్లో ఇప్పుడు దురంధర్ విలన్లు, హీరోల పేర్లు కనిపిస్తుండటంతో స్టూడెంట్స్ షాక్‌లో ఉన్నారు.
చనిపోయిన తేదీతో సహా పక్కా డీటెయిలింగ్!
ఈ క్వశ్చన్ పేపర్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సినిమాలో రెహ్మాన్ డకైత్ పాత్ర ఎప్పుడు చనిపోయిందో అదే తేదీని లెక్కలో కూడా వాడారు. “రెహ్మాన్ 5 డిసెంబర్ 2025న మరణించాడు” అని పేపర్‌లో ప్రింట్ చేయడంతో, “ఏం డీటెయిలింగ్ సర్ ఇది!” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ ఇప్పుడు కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక సబ్జెక్టుగా మారిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చివరికి హంజానే ఓనర్ అయిపోతాడుగా!
ఈ వైరల్ పేపర్ కింద నెటిజన్లు రకరకాల జోకులతో విరుచుకుపడుతున్నారు. “హంజా ఎలాగో రెహ్మాన్, ఉజైర్లను పర్మనెంట్ గా రిటైర్ చేస్తాడు కాబట్టి, చివరికి అతనే సోల్ ప్రొప్రైటర్ (ఏకైక యజమాని) అవుతాడు” అంటూ ఒక యూజర్ చేసిన కామెంట్ తెగ నవ్వులు పూయిస్తోంది. అకౌంట్స్ అంటే భయపడే వాళ్ళు కూడా ఇలాంటి పేపర్లు ఉంటే 100 మార్కులు ఈజీగా సాధిస్తారని మరికొందరు సరదాగా అంటున్నారు.
మొత్తానికి పబ్లిక్ సేఫ్టీ యాడ్స్ లో “బచ్చా హై తూ మేరా” డైలాగ్ వాడటం నుండి, పరీక్ష పత్రాల్లో క్యారెక్టర్లు రావడం వరకు.. ‘దురంధర్’ ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ సినిమా దెబ్బకు పాత సినిమా రికార్డులే కాదు, పాత కాలపు లెక్కలు కూడా చెల్లకుండా పోయాయి.

