బాహుబలి జేజమ్మ మళ్ళీ వచ్చేస్తోంది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుష్క 50వ సినిమా!
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ‘కథనార్’ (Kathanar) ట్రైలర్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అనుష్క అడుగుపెడుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్, తాజాగా విడుదలైన ట్రైలర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అనుష్క లుక్స్ అదిరిపోయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొన్ని ఊహించని సందేహాలు మొదలయ్యాయి.
హాలీవుడ్ రేంజ్ మేకింగ్.. అనుష్క పాత్ర నిడివి ఎంతో?
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అనుష్క వెండితెరపై మెరవబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రైలర్ లోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ చూస్తుంటే మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. అయితే, చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్‌లో అనుష్క కేవలం రెండు మూడు షాట్స్‌కే పరిమితం కావడం ఫ్యాన్స్‌ను కొంచెం నిరాశకు గురిచేసింది. ఇది అనుష్క కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా కావడంతో, ఆమె పాత్ర నిడివి ఎంతవరకు ఉంటుందోననే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.
అర్థం కాని తెలుగు డబ్బింగ్.. మైనస్ అవుతుందా?
మాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా కనిపిస్తున్నా, తెలుగు ట్రైలర్‌లో వాడిన పదాలు సగటు ప్రేక్షకుడికి అంతగా అర్థం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రగాడి కథలా అనిపిస్తున్నా, కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కాకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యేలా ఉంది. డబ్బింగ్ విషయంలో చిత్ర యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనుష్క 50వ మైలురాయి.. పూర్వవైభవం దక్కుతుందా?
అనుష్క శెట్టికి ఇది 50వ చిత్రం కావడం విశేషం. గత ఏడాది వచ్చిన ‘ఘాటీ’ డిజాస్టర్‌గా మిగిలింది, అలాగే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ పర్వాలేదనిపించింది. దీంతో ఈ మలయాళ చిత్రం ఆమె కెరీర్ కి చాలా కీలకంగా మారింది. జయసూర్యతో పాటు ప్రభుదేవా, వినీత్ వంటి దిగ్గజ నటులు ఉండటం ఈ పీరియడ్ డ్రామాకు ప్లస్ పాయింట్. రోజిన్ థామస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూలై లేదా ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
అనుష్క క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ 50వ సినిమాతో స్వీటీ బాక్సాఫీస్ వద్ద తన పూర్వవైభవాన్ని చాటుతుందో లేదో చూడాలి!

