ఎంతో పెద్ద హిట్ టాక్ వస్తే తప్పించి చిన్న సినిమాలు చాలా వరకూ థియేటర్ లో చూడటం లేదు. వాటిని ఓటిటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి కమెడియన్ ధన్‌రాజ్ (Dhanraj) దర్శకత్వం వహిస్తూ నటించిన తొలి చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam).
‘రామం రాఘవం’ సినిమాలో అతనితోపాటు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. తండ్రీకొడుకుల కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 21న బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది.
మార్చి 14 నుంచి ‘సన్ నెక్స్ట్’ (Sun NXT)లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ‘ఈ తండ్రీకొడుకుల ప్రయాణం మీరు ఊహించలేనిది’ అంటూ సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది.
అలాగే ‘ఈటీవీ విన్’లోనూ..
‘రామం రాఘవం’ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయనున్నట్టు ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించిన సంస్థ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు.
చిత్ర కథ ఇదీ:
దశరథ రామం (సముద్రఖని) ప్రభుత్వ ఉద్యోగి. నిజాయతీతో పనిచేసే రామం తనయుడు రాఘవ (ధనరాజ్) ఆయనకు పూర్తి భిన్నం. చదువుపై ఆసక్తిలేని అతడు బెట్టింగ్స్ వేస్తుంటుంటాడు. కొడుకుపై ఎంత ప్రేమ ఉన్నా అతడిని మంచి వ్యక్తిగా మార్చేందుకు రామం కోపం ప్రదర్శిస్తుంటాడు. దీంతో, ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఒకానొక సమయంలో తండ్రినే చంపాలని అనుకుంటాడు రాఘవ. జన్మనిచ్చిన తండ్రినే రాఘవ హత్య చేయించేందుకు దారి తీసిన పరిస్థితులేంటి? ఎవరి సాయంతో తన తండ్రిని అంతం చేయాలనుకున్నాడు?తదితర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.