దిల్ రాజు తన 50వ చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో అంజలికి మంచి రోల్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు దిల్ రాజు తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో మంచి పాత్ర పోషించింది అంజలి. అందుకే, దిల్ రాజు నిర్మాణ సంస్థ తనకు హోమ్ బ్యానర్ లాంటిది అని చెప్తూ ఉంటుంది అంజలి.
తాజాగా దిల్ రాజుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది అంజలి. అదే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ రీ-రిలీజ్. తన కెరీర్ కు మంచి కిక్ ఇచ్చిన ఆ సినిమాను రీ-రిలీజ్ చేయమని దిల్ రాజును కోరింది అంజలి.
ఈ రిక్వెస్ట్ కు దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. తనకు కూడా ఆ సినిమాను రీ-రిలీజ్ చేయాలనే ఆలోచన ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అంజలికి మాటిచ్చాడు.
ఫిబ్రవరిలో ఆ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తుందని చెబుతోంది అంజలి. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది, మరోసారి ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆ సినిమాను ఎంజాయ్ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది అంజలి.
‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చిన తర్వాత చాలామందికి నేను సీతగానే తెలుసు. ఆ తర్వాతే అంజలిగా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇప్పటికీ ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే డైలాగ్ చెప్పమని అడుగుతున్నారు. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆ మ్యాజిక్ నాతో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపింది.
తను తెలుగులో చేసిన ఏ పాత్రను కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా.. కొంచెం కూడా ఆలోచించకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని సీత పాత్ర అని చెప్పేసింది అంజలి. ఆ క్యారెక్టర్, ఆ సినిమా.. తమిళంలో కూడా చాలా ఫేమస్ అని తెలిపింది.
‘‘అంత పెద్ద సినిమాలో నాకు అవకాశం రావడం చాలా సంతోషం. అది నా లాంచ్ లాంటిదే. జర్నీ తర్వాత నేరుగా నా మొదటి తెలుగు మూవీ అది. ఎటు తిరిగి చూసినా అందులో పెద్ద యాక్టర్లే’’ అంటూ చెప్పుకొచ్చింది అంజలి.