వెండితెర ‘సోగ్గాడు’ శోభన్ బాబు అంటే కేవలం అందం, అభినయం మాత్రమే కాదు.. క్రమశిక్షణకు, పొదుపుకు ఆయన ఒక నిఘంటువు. తన సంపాదనను ఎలా దాచుకోవాలో, ఆస్తులను ఎలా పెంచుకోవాలో ఆయనను చూసి నేర్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియోలో శోభన్ బాబు గారు ఆస్తుల కంటే విలువైన ఒక సంపద గురించి చెప్పిన మాటలు ప్రతి ఒక్క తల్లిదండ్రుల కళ్ళు తెరిపిస్తున్నాయి.

“నిజమైన సంపద” గురించి తన మిత్రుడు చెప్పిన ఒక గొప్ప విషయాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే పూర్తిగా ఇక్కడ ఉంది:

“ప్రాపర్టీ (ఆస్తి) అంటే నాకు నా మిత్రుడు ఒకాయన జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవాడు.. ‘సుపుత్రుడు అయితే సంపాదన ఎందుకు? కుపుత్రుడు కాకపోతే మాత్రం సంపాదన ఎందుకు?’ అని .

నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు.. ఏమిటి సార్ దీని అర్థం అని అడిగితే ఆయన ఇలా వివరించారు: ‘ఏమీ లేదు.. సపోజ్ నీ కొడుకు సుపుత్రుడు (మంచివాడు) అయితే, నీ సంపాదన అతనికి అక్కర్లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి, స్వయం సమృద్ధి సాధించి జీవితంలో పైకి వచ్చి నిమ్మల్ని కూడా నిలబెడతాడు’ .

అదే సపోజ్ నీ అబ్బాయి కుపుత్రుడు (చెడ్డవాడు) అయితే.. ఈవినింగ్ సెషన్ లోనూ, డైనింగ్ సెషన్ లోనూ, వైనింగ్ సెషన్ లోనూ, లేక ఇంకో సెషన్ లోనో నాలుగు కాయితాల మీద తప్పుడు సంతకాలు పారేస్తాడు. ఇన్నేళ్లు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మంతా, ఆస్తి అంతా పటాపంచలు అయిపోతుంది’ .

అందువల్ల ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ అని ఎక్కువ మంది, ముఖ్యంగా మీ సినిమా వాళ్లు తాపత్రయ పడుతూ ఉంటారు. అది చూసి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఆ మిత్రుడికి పెద్దగా ప్రాపర్టీ కూడా ఏమీ లేదు, ఒక ఖద్దరు పంచె, ఖద్దరు చొక్కా ఉండేది.. అదే ఆయన ఆస్తి. కానీ తెలివితేటల పరంగా (Intellectually) ఆయన మనందరికంటే పెద్ద ఆస్తిపరుడు. అందుకే ఆయన్ని అంత గౌరవించి సన్నిహితంగా ఉండేవాళ్లం.

ఆయన ఎప్పుడూ ఆ మాట అంటూ ఉండేవాడు.. ‘మీరు ఎక్కువ తాపత్రయ పడతారు కానీ, మీ బిడ్డలను సుపుత్రులుగా పెంచండి. అంతేగానీ ఊరికే ఆస్తులు పెంచి బిడ్డల మీద బరువు వేయకండి. దానివల్ల ఉపయోగం లేదు. మీ పిల్లల ప్రవర్తనను సరిగ్గా ఉంచండి (Conduct your children well)'”

సంపాదన ముఖ్యం కాదని ఆయన అనలేదు.. కానీ ఆ సంపాదనను అనుభవించే బిడ్డలను సంస్కారవంతులుగా పెంచకపోతే, మీరు సంపాదించే ప్రతి రూపాయి వృధా అని ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

#actor shoban babu, #Conduct your children well, #Shoban Babu, #Shoban Babu’s Sensational Warning

By admin