తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది 7 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. అయితే, ఈ విజయాన్ని గుర్తించి సత్కరించడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలస్యం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రెస్ మీట్లో మాట్లాడిన అల్లు అరవింద్, “మన ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అన్నట్టుగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అందుకే ఏకతాబద్ధంగా మంచి పనులు జరగడం లేదు” అని స్పష్టం చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, “జాతీయ స్థాయిలో 7 అవార్డులు సాధించడం తెలుగు సినిమాకి గొప్ప విషయం. కానీ, ఇండస్ట్రీ సత్కరించకముందే సైమా గుర్తించి గౌరవించింది. ఇది సైమా యొక్క ప్రత్యేకత, సౌత్ సినిమాలపై ఉన్న నిజమైన ప్రేమకు నిదర్శనం” అని అన్నారు.
సినీ రంగం ఒక్కటిగా ముందుకు సాగితేనే మరిన్ని విజయాలు సాధించగలమని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమష్టి ప్రయోజనాల కోసం కృషి చేయాలని అల్లు అరవింద్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.