నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ ఒక అవసరం అనేది నిజం. కానీ ఆ అవసరం ఓ అలవాటుగా, ఆ అలవాటు ఓ అడిక్షన్గా మారి మనల్ని మనమే కోల్పోయే పరిస్థితికి నెట్టేస్తోంది. రోజు తలెత్తే నోటిఫికేషన్లు, ఎండలెస్ స్క్రోలింగ్, సోషల్ మీడియా లైక్స్ కోసం ఎదురు చూపులు… ఇవన్నీ మన నాడులను పట్టేసిన బానిస సంకెళ్లు. ఈ ఫోన్ బానిసత్వం నుంచి బయటపడటం చాలా మందికి అసాధ్యం. కానీ కొందరు ధైర్యంగా ఆ బంధాలను చీల్చి బయటపడతారు. అలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు.
తాజాగా ఆమె తన మొబైల్ అడిక్షన్ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. “ఒకానొక సమయంలో ఫోన్ లేకుండా నేను ఊహించలేనంతగా బానిసయ్యా. ప్రతి నిమిషం ఫోన్తోనే ఉండేదాన్ని. ఇది నాకు జీవితాన్ని ఆస్వాదించడంలో ఆటంకంగా మారింది, నేను దానికి బానిసను అయ్యిపోయాను, పెద్ద వ్యసనంగా మారింది” అంటూ నిజాయితీగా confessions చేసిందీ స్టార్ హీరోయిన్.
ఈ అలవాటు నుంచి బయటపడేందుకు సమంత తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలవాలి. డిజిటల్ డిటాక్స్ అనే పద్ధతిని కఠినంగా ఫాలో అయింది. ఫోన్, సోషల్ మీడియా అన్నీ పక్కన పెట్టేసి మూడు రోజులు పూర్తిగా డిజిటల్ టచ్ లేకుండా గడిపిందట. ఈ మూడు రోజులు తన జీవితాన్ని కొత్తగా అనుభవించే అవకాశంగా మారాయనీ చెబుతోంది. “ఆ తర్వాత నాకు నా అసలైన స్వభావం గుర్తుకొచ్చింది. నిజంగా ప్రశాంతంగా నన్ను నేను ఫీలయ్యా,” అంటూ తెలిపింది.
సమంత సూచిస్తోంది –
“ఫోన్ వాడకాన్ని పరిమితి లో ఉంచండి. అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. అవసరం లేనప్పటికీ చేతిలో ఫోన్ పట్టుకుని కూర్చోవడం అనే అలవాటును మానుకోవాలి.”
ఇది కేవలం సెలబ్రిటీ సలహా కాదు – మనకో జీవిత మార్గదర్శకం. ఫోన్ మన చేతుల్లో ఉండాలి, మనమే దానికి మాస్టర్లు కావాలి – కానీ, దానికి బానిసలు కాకూడదు. సమంత అనుభవం మనందరికీ ఓ గట్టి హెచ్చరిక. మన డిజిటల్ బానిసత్వాన్ని వెనక్కి నెట్టి, మన అసలైన జీవితాన్ని ముందుకు నడిపించాల్సిన సమయం ఇది!