సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’లోని ‘పవర్ హౌస్’ సాంగ్ ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట తమిళంలో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అద్భుతమైన బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటే కాదు, సినిమా మీద హైప్ కూడా మామూలుగా పెరిగిపోయింది. ఆగస్ట్ 14న థియేటర్లలో ఈ పాటను పెద్ద స్క్రీన్‌పై చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ షాకింగ్ విషయం ఏంటంటే… ఈ పాటకు ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్‌కి మాత్రం నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది! తెలుగు పాట వినగానే, చాలా మంది శ్రోతలు “దయచేసి ఒరిజినల్ తమిళ వెర్షనే ఉంచండి” అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తమిళ వెర్షన్ మొదట విడుదలైనప్పుడు, తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అనేకమంది ప్లే లిస్టుల్లో ఇప్పుడే ఆ పాట ఉంది కూడా.
తెలుగు వెర్షన్ విషయంలో అసలు ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే… లిరిక్స్!
అవి పాటలో ఎనర్జీకి ఫిట్ అయ్యేలా లేకపోవడం, అసలు ఒరిజినల్ వర్షన్ ఇచ్చిన పవర్‌ను రీపీట్ చేయలేకపోవడం వల్లే ఆ విమర్శలు వస్తున్నాయి. అందుకే, మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ “ప్లీజ్… తమిళ వర్షన్‌నే ఉంచండి” అనే డిమాండ్ పెరుగుతోంది.
ఇదే తొలిసారి కాదు. ఇదివరకే ‘మాస్టర్’, ‘లియో’ వంటి సినిమాల్లోనూ తెలుగు పాటలు అసంతృప్తిని మిగిల్చాయి. తమిళ నిర్మాతలు తమ పాటల తమిళ వెర్షన్లపై ఎంత కేర్ తీసుకుంటారో, అంతే ఫోకస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌పైనా పెట్టాలి. లేకపోతే, ఇటువంటి బ్యాక్లాష్లకు రెగ్యులర్‌గా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే… ‘కూలీ’ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోని పవర్ హౌస్ సాంగ్ ఇప్పటికే తమిళ వర్షన్ విడుదలై చార్ట్ బస్టర్స్ లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్ ను సైతం రిలీజ్ చేశారు. ఈ పాటను తెలుగులో రవీంద్ర గోసాల రాశారు. అరివు పాడారు. ‘కూలీ’ నుండి వచ్చిన మూడో పాట ఇది.
మొత్తంగా చూసుకుంటే… ‘పవర్ హౌస్’ పాట మళ్లీ ఒక్కసారిగా తమిళం వల్లే పవర్ చూపించనుందా? లేక తెలుగులో మరో సారిగా ట్రాక్ మార్చి మళ్లీ వదలుతారా?