బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (Mukul Dev) (54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ విషయాన్ని తెలియజేశారు.
రవితేజ కృష్ణ మూవీలో విలన్‌గా నటించిన నటుడు ముకుల్ దేవ్ (Mukul Dev) మృతి చెందారు. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ముకుల్ దేవ్. శుక్రవారం (2025మే23న) రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
అయితే, కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు పలు నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన మృతిని అనుసరించి, February 26న పెట్టిన ఆయన చివరి Instagram పోస్ట్‌ను అభిమానులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఓ విమానం లోపల నుంచి తీసిన మేఘాల వీడియో ఉంది. దానికి జతగా ఉన్న వ్యాఖ్య మరింత ఆవేదన కలిగించేలా ఉంది:
“And if your head explodes with dark forebodings too…. I’ll see you on the dark side of the moon.”
(అంటే — “నీ తలలోనూ చీకటి శకునాల పేలుడు మొదలైతే… నేను నిన్ను చంద్రుని చీకటి వైపున కలుస్తాను.”)
ఈ వ్యాఖ్యను చూసి, ఆయన తన మరణాన్ని ముందే ఊహించారా అన్న సందేహాలు, ఊహాగానాలు అభిమానుల మధ్య డిస్కషన్ గా మారింది.
‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్. సీరియల్ నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టిన ముకుల్ పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దస్తక్’తో నటుడిగా వెండితెరకు పరిచమైన ఆయన బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు.
రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’తో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ‘కేడి’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.