సినిమా వార్తలు

రణవీర్ సింగ్‌పై షాకింగ్ FIR! ‘కాంతార’ దైవాన్ని వెక్కిరించినందుకు పోలీసుల యాక్షన్.. అరెస్ట్ తప్పదా?

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. కన్నడ సంచలనం రిషబ్ శెట్టి సృష్టించిన ‘కాంతార’ మ్యాజిక్‌ను అనుకరించబోయి.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. కోట్లాది మంది భక్తులు ఆరాధ్యదైవంగా కొలిచే ‘చాముండి దైవ’ సంప్రదాయాన్ని రణవీర్ అవమానించాడంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

గోవా వేదికగా వివాదం!

గతేడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ‘కాంతార’ సినిమాలో రిషబ్ శెట్టి చేసిన దైవ నర్తనను రణవీర్ సింగ్ వేదికపై మిమిక్రీ చేస్తూ ప్రదర్శించాడు. అయితే, తీర ప్రాంత కర్ణాటక ప్రజల మనోభావాలను, వారి పవిత్ర సంప్రదాయాన్ని రణవీర్ వెక్కిరించాడని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

తీవ్రమైన సెక్షన్ల కింద కేసు!

ఈ వివాదంపై రణవీర్ సింగ్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆగ్రహం చల్లారలేదు. బుధవారం రోజున బెంగళూరు పోలీసులు రణవీర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 196, 299, మరియు 302 కింద FIR నమోదు చేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, మత విశ్వాసాలను అవమానించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

క్షమాపణలు చెప్పినా కేసు నమోదు కావడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో కలకలం రేగుతోంది. ఈ FIR పై రణవీర్ సింగ్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే రణవీర్‌కు చట్టపరంగా చిక్కులు తప్పవని లీగల్ నిపుణులు చెబుతున్నారు.

Similar Posts