ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్‌.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి ఒకేసారి ఐదారు చిత్రాలు మాత్రం చేయనని చెబుతోంది ఈ బ్యూటీ.

వ్యాధి, కెరీర్‌లో వచ్చిన బ్రేక్‌లతో వెనకబడిన సమంత, ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయినా సరే, ఈ గ్యాప్ తన జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లిందని బహిరంగంగానే అంగీకరించింది.

ఢిల్లీలో జరిగిన 52వ నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్ లో పాల్గొన్న సమంత, తన జీవిత తత్వాన్ని ఓపెన్‌గా చెప్పింది.

“రెండు ఏళ్లుగా నాకు సినిమా రిలీజ్ లేదు. ఎలాంటి లిస్ట్‌లోనూ లేను. 1000 కోట్ల సినిమా కూడా లేదు. కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను” అని స్పష్టంచేసింది.

“అంతకుముందు ప్రతి శుక్రవారం నాకు భయం. ఎవరో నన్ను రీప్లేస్ చేస్తారేమో, నా విలువ బాక్స్ ఆఫీస్ నంబర్లకే పరిమితమైపోయింది. కానీ మయోసైటిస్‌ తో పోరాటం తర్వాత జీవితాన్ని వేరే కోణంలో చూసే అవకాశం దొరికింది” అని సమంత ఓపెన్‌గా చెప్పింది.

‘ఇకపై సినిమాలతో పాటు అరోగ్యంపై కూడా దృష్టిపెడతాను. గతంలో పోలిస్తే నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమాలతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెడతాను. మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.

గతంలో మాదిరి ఒకేసారి ఐదారు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా..ప్రేక్షకులకు మనసుకు నచ్చే నచ్చే వాటితోనే పలకరిస్తాను. ప్రాజెక్ట్‌ల సంఖ్య తగ్గింది.. కానీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుంది’ అతని సమంత చెప్పుకొచ్చింది.

సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఇటీవల ప్రేక్షకుల ముందుక వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తూంది. రాజ్‌-డీజే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ఆదిత్యారాయ్‌ కపూర్‌, అలీ ఫజల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అలాగే త్వరలో డైరెక్టర్ నందిని రెడ్డి తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌లో నటించనుందని సమంత కన్ఫర్మ్ చేసింది.

, , , , ,
You may also like
Latest Posts from