‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’లాంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన హోంబలే ఫిలింస్ — ఈసారి క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి అడుగు పెట్టింది కొత్త ప్రపంచంలోకి. యానిమేషన్ ప్రపంచం. అదే ‘మహావతార్ నరసింహ’. ఇది హోంబలే ప్లాన్ చేస్తున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌కి తొలి అడుగు. పూర్వ పురాణాల్ని ఆధునిక విజువల్స్‌తో మిళితం చేస్తూ, మానవత్వానికి అర్థం చెప్పేలా రూపొందిన విభిన్న ప్రయోగం ఇది.

తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా… మొదట మౌనంగా మొదలైంది. కానీ మూడో రోజు నుంచి? హరిద్వానంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి! బయట పెద్దగా ప్రమోషన్లు లేకపోయినా… మౌత్ టాక్ మంత్రాలా పని చేసింది. ప్రేక్షకులే ప్రచారకులయ్యారు. థియేటర్లలో చెప్పులు విప్పి చూడడం, సినిమాకి మధ్యలో “ఓం నంః నారాయణాయ” అనే భక్తిగీతాలు పాడడం… ఇవన్నీ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్!

విశ్వరూపమైన విజువల్స్… విరాట్ భక్తి అనుభూతి
ఈ యానిమేషన్ చిత్రం కథ అందరికీ తెలిసినదే అయినా — చూపించిన తీరు మాత్రం వింతగా ఆకట్టుకుంటోంది.

వారాహావతారం లో భూమిని రక్షించేందుకు వచ్చిన రూపం

ప్రహ్లాదుడిపై హిరణ్యకశిపుడు చేసిన క్రూరమైన యత్నాలు

హోలిక వద వేడుకల నేపథ్యంలో భక్తి పరవశం

తర్వాత నరసింహ రూపంతో హిరణ్యకశిపుడి సంహారం

ఈ దృశ్యాలన్నీ టెక్నికల్‌గా అద్భుతంగా రూపొందాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం అందించిన శ్యామ్ C.S. తన సంగీతంతో సాక్షాత్తు దేవతలే థియేటర్‌లోకి దిగివచ్చిన అనుభూతిని కలిగించారంటే అతిశయోక్తి కాదు.

పిల్లలతో చూడాల్సిన పవిత్రమైన సినిమాటిక్ అనుభవం

దర్శకుడు అశ్విన్ కుమార్ తెలిసిన కథను సరికొత్త కోణంలో, భావోద్వేగాలతో నింపిన విధానం ప్రశంసల పాలు అవుతోంది. యానిమేషన్ కథే అయినా… పాత్రల్లో ఉన్న ఎమోషన్లు, వారికున్న ఛాయలూ, శక్తులూ మనసుకి హత్తుకుంటున్నాయి.

పిల్లలతో చూసే సినిమాల లోపల ఎమోషనల్, విజువల్, మరియు భక్తి పరమైన బలాన్ని కలిగి ఉన్న చిత్రం కావడంతో ఇది కుటుంబాల్ని దగ్గర చేసే ప్రయత్నంగా మారింది. బుక్ మై షో వంటి టికెట్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం ఇది ‘వీరమల్లుని’ మించిపోయే స్థాయిలో టికెట్లు బుక్ అవుతుండటం… ఈ యానిమేషన్ సినిమాకి ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

ఇదొక యానిమేషన్ కాదు, ఓ ఆధ్యాత్మిక యుద్ధం! మనం చూసిన లైవ్ యాక్షన్ సినిమాలకు పోటీగా నిలుస్తూ… వినూత్న బాణీతో వచ్చిన ‘మహావతార్ నరసింహ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక సంచలనం. మీరు ఇంకా చూడలేదా? అయితే ఈ వారం ఎక్కడా వెయిట్ చేయకుండా పిల్లల్ని, కుటుంబాన్ని తీసుకుని థియేటర్‌కు వెళ్లాల్సిందే!

, , ,
You may also like
Latest Posts from