నితిన్ – ఒకప్పుడు హిట్ మిషన్ లా వరుసగా విజయాలు కొట్టిన యువహీరో. కానీ రీసెంట్ గా అతడి సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా ‘తమ్ముడు’ లాంటి భారీ హైప్‌తో వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, యాక్షన్ మిక్స్ ఉన్నా… ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఎఫెక్ట్ నితిన్ కెరీర్ పై భారీగా పడే అవకాశాలు కనపడుతున్నాయి.
ఆ మధ్యన నితిన్ కోసం ప్లాన్ చేసిన భారీ మాస్ ఎంటర్టైనర్ ‘పవర్‌పేట్’ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కక ముందే నిలిచిపోయింది. సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని భావించినా… కొన్ని అంతర్గత కారణాలతో ప్రాజెక్ట్ పక్కకు పెట్టారు. ఈ కథని, రాసుకుని దర్శకత్వం వహించేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కృష్ణ చైతన్య – లిరిక్ రైటర్‌గా పేరుపొందిన ఆయన, తరువాత దర్శకుడిగా మారి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తీసారు. అయితే ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
అయితే ఇప్పుడు, ఆ ఫెయిల్యూర్నుంచి కోలుకొని పవర్‌పేట్ ప్రాజెక్ట్‌కి మళ్లీ ప్రాణం పోస్తున్నారు కృష్ణ చైతన్య. మరింత బలమైన ప్రీప్రొడక్షన్తో, పక్కా కమర్షియల్ డిజైన్‌తో, ఈసారి హీరోగా సందీప్ కిషన్ ఎంటర్ అవుతున్నారు.
సినిమాను ఆగస్ట్ 9న హైదరాబాద్‌లో ఘనంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో సందీప్ మళ్లీ మాస్ అటెంప్ట్ చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. యాక్షన్, పౌరుషం, రాజకీయ ఎలిమెంట్స్, గోదావరి నేపథ్యం – ఇవన్నీ కలిపి ఊరమాస్ మూవీగా రూపొందనుంది.
ఈ సినిమాను విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. వీరు గతంలో భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు నిర్మాతలుగా నిలిచారు. ఇప్పుడు పవర్పేట్తో మాస్ జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తమ్ముడు ఫెయిల్యూర్‌తో నితిన్ బయటపడ్డా… ఆ కథ, ఆ ప్రాజెక్ట్ మరో హీరో చేతిలో కొత్తగా పుట్టబోతుంది. ఇప్పుడు సందీప్ వర్సెస్ గోదావరి గ్యాంగ్స్ అంటూ మళ్లీ హైప్‌ను లాగించేందుకు సిద్ధమవుతోంది టీం పవర్‌పేట్!