తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత (Tension) నెలకొంది. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ అక్కడికి వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలేజీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా (Media)ను సయితం అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కూడా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు.
యూనివర్సిటీకి మంచు మనోజ్ (Manchu Manoj) వస్తున్నారన్న సమాచారంతో గేటు వద్ద పోలీసులు వేచి ఉన్నారు.కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరినీ అనుమతించడంలేదు. గేట్లను కూడా మూసివేశారు. దీంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్‌బాబు (Mohan Babu), మంచు విష్ణు ఉండడంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
మంచు మనోజ్ కుంటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది.
గతంలో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు.