ఎన్టీఆర్ “దేవర” లో విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ పరిచయం అయ్యారు. అంతకు ముంది ప్రభాస్ ఆదిపురుష్ తోనూ ఆయన తెలుగు వారిని పలకరించారు. లేటెస్ట్ గా సైఫ్ పై ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగింది.
ఓ గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబయి (Mumbai)లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గురువారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో తను ముంబై లోనే తన ఇంట్లో ఉండగానే ఈ దాడికి లోనయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఎవరో తన ఇంట్లోకి దొంగతనం చేసేందుకు చొరబడగా సైఫ్ అడ్డుకునే యత్నంలో అతడు తనపై హత్యాయత్నం చేసినట్టు బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు టీమ్ లను ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఈ విషయమై సైఫ్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం’’ అని వెల్లడించింది.