సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన మలుపులో ఉంది, ఆయన తీసిన భారీ డిజాస్టర్లు ఇప్పుడు ‘స్లమ్‌డాగ్’ మెడకు ఉరితాడులా చుట్టుకుంటున్నాయి! కోట్లు పోగొట్టుకున్న బయ్యర్లు ఇప్పుడు పూరీని వదిలే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన పూరీ జగన్నాథ్ , వరుసగా ‘లైగర్’ , ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భారీ ఫ్లాపులతో పాతాళానికి పడిపోయారు. ఈ సినిమాలు మిగిల్చిన నష్టాలు ఇప్పుడు పూరీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ మెట్లు ఎక్కిన ఈ వివాదం , ఇప్పుడు ఆయన రాబోయే సినిమా ‘స్లమ్‌డాగ్’ విడుదలను అడ్డుకునే స్థాయికి చేరుకుంది.

వరంగల్ శ్రీను వంటి డిస్ట్రిబ్యూటర్లు ‘లైగర్’తో భారీగా నష్టపోయి మార్కెట్ నుంచే మాయమయ్యారు , ‘హనుమాన్’ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి సైతం ‘డబుల్ ఇస్మార్ట్’తో భారీ దెబ్బ తిన్నారు. ఈ బాకీల చెల్లింపు విషయంలో పూరీ జగన్నాథ్ గడువు కోరుతున్నా , అటు బయ్యర్లు మాత్రం ఇక సహనంతో లేమని తేల్చి చెపుతున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్‌డాగ్’ షూటింగ్ పూర్తి చేసిన పూరీ, నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు.
అయితే , పాత బాకీలు తీర్చకుండా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానివ్వబోమని డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు గట్టి పట్టుబట్టారు. చివరికి ‘పోకిరి’ రీ-రిలీజ్ కూడా అందుకే ఆగిపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. థియేట్రికల్ డీల్స్ క్లోజ్ కావాలంటే ముందు పాత లెక్కలు తేలాల్సిందేనని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు.

విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ , పూరీ చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలు ‘స్లమ్‌డాగ్’ను థియేటర్లలోకి రానిస్తాయా అన్నది అనుమానమే. పూరీ ఈ సవాళ్లను దాటుకుని మళ్ళీ ట్రాక్‌లోకి వస్తారా , లేక ఈ చిక్కుల్లో మరింత కూరుకుపోతారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ముందు ఉన్నది కేవలం సినిమా సక్సెస్ మాత్రమే కాదు , తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం!

