
వివాదాలు, రామ్ గోపాల్ వర్మకు కొత్తకాదు. బాక్సాఫీస్ విజయాలు దూరమైనా, ఆయన కెమెరా మాత్రం ఆగదు. వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్న వర్మ ఈసారి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. కారణం — ఆయన సోషల్ మీడియాలో చేసిన సంచలన వ్యాఖ్యలు!
రాజమండ్రిలోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు, రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మతో పాటు యాంకర్ స్వప్న పేరును కూడా ఫిర్యాదులో చేర్చారు.
వివరాల్లోకి వెళితే..
ఆర్జీవీతో పాటు టీవీ ఛానల్ యాంకర్ స్పప్నపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హిందూ ఇతిహాసాలు – దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. ఆర్జీవీతో పాటు సదరు యాంకర్‌పై క్రైమ్ నెం 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
యాంకర్ వివాదాస్పద ప్రశ్నలను రామ్ గోపాల్ వర్మ కోసం ఉద్దేశపూర్వకంగా అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోలు వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. దీంతో, రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఆర్జీవీతో పాటు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో.. వివిధ అంశాలపై ఆర్జీవీపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే..
ప్రస్తుతం ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. అయితే ఈ వివాదం మరింత ముదురనుంది అనే వాతావరణం కనిపిస్తోంది.
ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే — వర్మ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. రెండూ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
