ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానిస్తారు. దాంతో అతనికి ‘సమాధి శిక్ష’ అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధిలో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ బయిటకు వస్తుంది. ఆ ఊళ్ళో శోభనం జరుపుకునే అమ్మాయిల్ని చంపేస్తుంటుంది.
ఇప్పుడు ఆ ప్రేతాత్మను కంట్రోలులోకి తీవాలంటే అంతకు మించి శక్తి కావాలి. దాంతో ఈ సమస్య నుంచి తమని కాపాడేది జైలు శిక్ష అనుభవిస్తున్న రాధ (హెబ్బా పటేల్) సోదరి భైరవి (తమన్నా) అని తెలుసుకుంటారు ఆ ఊరి జనం. భైరవి ఓ నాగసాధువు. ఆమెను ఒప్పించి తన గ్రామానికి తీసుకువస్తారు. ఆ తర్వాత భైరవి, తిరుపతి ప్రేతాత్మ మధ్య ఏం జరిగింది. చివరకి ఏమైంది అనేదే ‘ఓదెల 2’.
విశ్లేషణ:
2022 ఆగస్ట్ ఓటిటిలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ కు ఈ సినిమా సీక్వెల్. దాంతో ఆ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే ఈ ‘ఓదెల 2’ మొదలెట్టారు. అక్కడదాకా బాగానే ఉంది.
అయితే దర్శకుడు కథ,కథనం కన్నా హింసను ఎక్కువ నమ్ముకున్నాడు. ఫస్టాఫ్ లో తిరుపతి ప్రేతాత్మ మహిళలపై దాడి చేసే సన్నివేశాలు అర్థం ఉన్నా, అవి మితిమీరిన హింసతో నిండిపోయాయి. ఈ హింస ప్రేక్షకుని ఎమోషనల్‌గా ఎంగేజ్ చేయడం కన్నా, అసహనాన్ని రేకెత్తించేలా మారిపోయింది.
సినిమా కథనానికి ‘ఆత్మ’ను జోడించి, దానికి ‘పరమాత్మ’తో ముగింపు ఇవ్వాలన్న తలంపు వినూత్నంగా అనిపించవచ్చు. కానీ ఆ తలంపును తెరపై జీవితం ఇవ్వాలంటే, కథలో భయం, పాత్రల్లో నిగూఢమైన భావోద్వేగం, మరీ ముఖ్యంగా – మనసును తాకే తీర్పు ఉండాలి.అవి ఈ సినిమాలో కొరవడ్డాయి.
అలాగే ఇంట్రవెల్ కు ముందు ఊరికి సాయం చేసేందుకు నాగ సాధువు భైరవి ఎంట్రీతో ఇంటర్వెల్ డ్రామాటిక్ హై పోయింట్‌ను అందుకుంది. అదే సమయంలో కథ కొత్త టర్న్ ను, బాధ్యతను తీసుకుంది. ఆ బాధ్యతను డైరక్టర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అయితే అక్కడ నుంచే కథలో గ్రిప్ పోయింది. సినిమా నెమ్మదించిపోయింది.
సెకండాఫ్ సాగదీసిన నెరేషన్‌తో బోరు కొట్టిస్తుంది. శివతత్వాన్ని చర్చించే సన్నివేశాలు ఉండే సమయంలో… ఆ తాత్వికతలో స్పష్టత లేకపోవడం సినిమాకు మరో మైనస్ అయింది. అయితే, కొంత ఊపిరి అందించిన ఘట్టం – శివుడు ప్రత్యక్షమయ్యే క్లైమాక్స్.
భైరవి నీడలో శివుడు కనిపించే సన్నివేశం, అలాగే చివర్లో భైరవిని కాపాడటానికి నందీశ్వరుడు & శివుడు వచ్చే సీన్లు ‘హనుమాన్’ సినిమాకు ఓ రీతిలో ట్రిబ్యూట్ లా అనిపించినా… అవే సినిమాను కొంత మేరకు నిలబెట్టాయి.
ప్రేతాత్మకు , శివ శక్తి మధ్య సంఘర్షణ ఉన్న నేపథ్యంలో ఆలౌడ్ యాక్షన్ ఉండటం సహజమే కానీ, అది కథని మింగేస్తే – చూసేవారికి మిగిలేది అసహజ కథనమే, భావోద్వేగం ఉండదు. అదే ఈ చిత్రానికి ప్రధాన లోపం.
టెక్నికల్ గా…?
కథనంలో లోపాలు, హింస పరిమితి దాటి ప్రేక్షకుడిని దూరం చేయడం, సెకండాఫ్ నెమ్మదిగా సాగిపోవడం వంటి సమస్యలు ఓదెల 2ను పూర్తిగా మెప్పించకపోయినా… సినిమాకు ఓ అండగా నిలిచింది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ అందించిన విభిన్నమైన నేపథ్య సంగీతం (BGM).
ఓ డెవోషనల్ థ్రిల్లర్‌గా భావోద్వేగాలను మిగిలించే బాధ్యత ఈ బీజీఎం తీసుకుని విజయవంతంగా నిర్వర్తించింది. అలాగే, సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌లో సౌందర్ రాజన్ పనితీరు గ్రాఫికల్ విజువల్స్‌తో బలపడింది. వీఎఫ్ఎక్స్ కొన్ని కీలక సన్నివేశాల్లో—ప్రత్యేకించి క్లైమాక్స్‌లో—చక్కగా పనిచేసింది.ఇంకా, కొన్ని డైలాగ్స్ సందర్భానుగుణంగా ఉండి మెప్పిస్తాయి.
ఎవరెలా చేసారు?
నాగ సాధువు భైరవిగా తమన్నా నటన బాగుంది, క్లైమాక్స్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ట అసలైన హైలైట్, ఆయన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు.
హెబ్బా పటేల్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఆమె తక్కువగా కనిపించింది.
సాయిబుగా మురళీ శర్మ, పూజారిగా శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల్లో బాగా నటించారు.
ఈ సినిమా ఎవరికి నచ్చొచ్చు, ఎవరు తప్పుకోవచ్చు ?
ఈ సినిమా మిస్టిక్ థీమ్‌లు, డివైన్ ఎలిమెంట్స్ ఆస్వాదించే వారికి నచ్చవచ్చు; కానీ లాజిక్, గ్రిప్పింగ్ నెరేషన్ కోరుకునే వారు మాత్రం నిరాశ చెందవచ్చు.
ఎండ్ పంచ్
“ఓదెల 2: దేవాలయానికి వెళ్ళిన హారర్ ట్రిప్!”