ఒక పాత్రలో కాదు… ఏ పాత్రలోనైనా జీవించగల నటుడు చిరంజీవి! ఆయన స్క్రీన్‌పై కనిపించినప్పుడు కేవలం నటుడు అనిపించడు – ఆ పాత్రగా మారిపోతాడు. ముని కళ్లు ఉన్న మర్డరర్‌గా కనిపించినా, గ్రామీణ యువకుడిగా కనిపించినా, గుండె గదులలో తళతళలాడే మృదుస్వభావుడిగా కనిపించినా… చిరంజీవి పరకాయ ప్రవేశం చేసే తీరు నిక్షిప్తంగా నాటకం కాదు, నిజమైన జీవితం అనిపిస్తుంది. శారీరక భావాలు, కళ్లలో కలల వాడి వెలుగు, ఒప్పుకోలేని సంఘర్షణ – ఇవన్నీ అతడి నటనలో పొలివెత్తుతుంటాయి.
ఈ అసాధారణ నైపుణ్యానికి తొలి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా – ‘పున్నమి నాగు’.
మనిషిలో పాము లక్షణాలు తాలూకు లోతైన భావోద్వేగాల్ని ఒదిగించిన ఈ పాత్రలో చిరంజీవి చేసిన నటన… ఆయనలోని అసలైన “నటుడిని” ప్రపంచానికి చూపించింది.
చిరంజీవి నటనా ప్రతిభను ప్రేక్షకులకు మొదటిసారి స్పష్టంగా చూపించిన చిత్రం ‘పున్నమి నాగు’. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు – చిరంజీవి కెరీర్‌కు బలమైన పునాది వేసిన ఓ చరిత్రాత్మక ప్రయాణం. 1980 జూన్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నా ప్రెష్ గానే ఉంటుంది, కానీ అందులోని పాత్రలు, భావాలు, పాటలు ఇంకా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి.
విలక్షణ పాత్రలో మెగా మెప్పు
ఈ సినిమాకు కథా పుట్టుక 1973లో వచ్చిన హాలీవుడ్ చిత్రం Sssssss నుంచి. ఆ చిత్రాన్ని ఆధారంగా తీసుకుని, మన భారతీయ మూలాలు, ఆచారాలు, నమ్మకాలను మిళితం చేస్తూ దర్శకుడు రాజశేఖర్ (అసలు పేరు సుబ్రహ్మణ్యం) కథను తెలుగువారికే కాకుండా భారతీయులందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దారు. రజనీకాంత్ సలహా మేరకు ఆయన పేరును రాజశేఖర్‌గా మార్చుకున్న ఈ దర్శకుడు, ముందు కన్నడలో హుణ్ణిమెయ రాత్రియల్లి అనే సినిమాను రూపొందించి ఘన విజయం సాధించారు. అదే కథను పున్నమి నాగు పేరుతో ఏవీయమ్ సంస్థ తెలుగులో తీసుకొచ్చింది.
పాము లక్షణాలతో నిండి ఉన్న ‘నాగులు’
కథ అంతా పాము లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక పాముల దాసరి తన కొడుకు నాగులు పాము చేతిలో చనిపోకుండా ఉండాలని ఆశించి, చిన్నప్పటినుంచి అతనికి విషం పెడుతూ ఉంటాడు. ఈ కారణంగా నాగులు శరీరంలో పాము లక్షణాలు పెరిగిపోతాయి. పున్నమి వచ్చిన ప్రతిసారి అతడు తన నియంత్రణ కోల్పోయి, అమాయక యువతుల్ని ఆకర్షించి, వారిని చంపేస్తుంటాడు. చివరికి తన ప్రేయసినే కోల్పోయి, తన పరిస్థితికి నావే కారణమని తెలిసి, జీవితానికి స్వస్తి చెబుతాడు. ఈ విషాదాంతం ప్రేక్షకుల గుండెను కలిచేస్తుంది.
నటుడిగా చిరంజీవికి ముద్ర
ఈ సినిమాలో చిరంజీవి చేసిన నటన, ముఖ్యంగా “అద్దంలో తన ముఖం చూసుకుని ఏడిచే సన్నివేశం”, ఇప్పటికీ ది బెస్ట్ అని గుర్తుంచుకుంటారు. అతని ముఖంపై వచ్చిన పొరలు చూసి – తన మనుష్యత్వం నశించిపోతుందన్న బాధలో అతని కన్నీళ్లతో కలసి ప్రేక్షకుల కన్నీళ్లు కూడా కారించాయి. పాము లక్షణాల నుంచి విముక్తి పొందాలన్న ఆశతో గన్నేరు కాయలు తినే ప్రయత్నాలు, తన లోపాన్ని అంగీకరించే వేదన – ఇవన్నీ చిరంజీవి నటనా లోతును చూపించాయి.
తరువాతి ప్రయాణంలో ప్రభావం
‘పున్నమి నాగు’ తర్వాతే చిరంజీవికి మంచి పాత్రల అవకాశాలు వచ్చాయి. కానీ మాస్ ఇమేజ్ పెరిగిన తర్వాత ఆయన నటనా వైవిధ్యం పూర్తిగా వెలుగు చూడలేకపోయింది. స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి సినిమాలు వచ్చినప్పటికీ, ‘పున్నమి నాగు’లోని నటుడిని పూర్తిగా ఉపయోగించుకున్న దర్శకులు అరుదుగా మాత్రమే కనిపించారు.
సినిమా మ్యూజిక్, తారాగణం, విజయం
ఈ చిత్రానికి కె. చక్రవర్తి అందించిన సంగీతం సినిమాకు ఓ ప్రధాన బలంగా నిలిచింది. వేటూరి సుందరరామమూర్తి రచించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “పున్నమి రాత్రి…” అనే పాట ఇప్పటికీ పాడుతుంటారు. నరసింహరాజు, రతి జంటపై తెరకెక్కిన పాటలు ఆకట్టుకోగా, జయమాలిని ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది. చిరంజీవికి జోడీగా నటించిన మేనక – ఈ తరం నటి కీర్తి సురేశ్ తల్లి కావడం విశేషం. 100 రోజులు పండగలా జరుపుకున్న ఈ చిత్రం, అప్పట్లో మంచి కమర్షియల్ విజయం సాధించింది.
‘నాగు’, ‘జీనే కీ ఆర్జూ’ వరకు కథ ప్రస్థానం
‘పున్నమి నాగు’ విజయంతో ఏవీయమ్ సంస్థ చిరంజీవితో ‘నాగు’ అనే సినిమాను కూడా నిర్మించింది. ఇది షమ్మీ కపూర్ ‘తీస్రీ మంజిల్’కు ప్రేరణగా వచ్చిన కథ. కానీ ఇది ‘పున్నమి నాగు’ స్థాయికి చేరుకోలేకపోయింది. ఇక దర్శకుడు రాజశేఖర్ ఈ కథను హిందీలో ‘జీనే కీ ఆర్జూ’ పేరుతో మిథున్ చక్రవర్తితో మళ్లీ తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన తమిళంలో పలు చిత్రాలు తీసినా, 1989లో మళ్లీ ఏవీయమ్ సంస్థతో కలిసి బామ్మమాట బంగారు బాట అనే తెలుగు సినిమాను కూడా రూపొందించారు.
చివరగా చెప్పాల్సిందెంటంటే – ‘పున్నమి నాగు’ చిరంజీవి కెరీర్‌కు ఒక మలుపు, ఒక వెలుగు, ఒక గుర్తింపు. ఈ చిత్రం ద్వారా తనలోని అసలైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దానికి ఇప్పుడు 45 ఏళ్లు కావడం – ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది