మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సుమారు ₹100 కోట్లు గ్రాస్ కలెక్షన్లతో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఇది పది కోట్లకు పైగా కలెక్షన్ చేసిన తొలి మళయాళ సినిమాగా నిలిచింది.
ఇప్పటివరకు మూవీలో హింస మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, అప్పట్లో మేకర్స్ “సీక్వెల్ తో తిరిగి వస్తాం” అంటూ హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ‘మార్కో 2’ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ఆపేశారు.
OTT రిలీజ్ తర్వాత ఊహించని పరిణామం
థియేటర్స్‌లో హిట్ అయిన ఈ రక్తపాతం సన్నివేశాలతో నిండిన యాక్షన్ మూవీకి OTT లో విడుదలైన తర్వాత మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతోనే పరిస్థితులు మరో స్థాయికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు కూడా టీవీలో ప్రసారం చేయడం నిషేధించింది.
దాంతో ఉన్ని ముకుందన్ ‘మార్కో’ కి సీక్వెల్ రాదని తాజాగా ప్రకటించారు. ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ‘‘మార్కో 2 ఎప్పుడంటారు?’’ అని ప్రశ్నించగా… ఉన్ని చాలా స్పష్టంగా ‘‘క్షమించండి, కొనసాగింపు ఉండదు. ఆ ప్రాజెక్ట్‌ని డ్రాప్ చేశాం,’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
‘‘ప్రేమ ఎంతగానో దక్కింది.. కానీ వ్యతిరేకత ఇంకా ఎక్కువగా వచ్చింది!’’
‘‘మార్కోకి కొనసాగింపు చేసే ఆలోచనకు పూర్తిగా గుడ్‌బై చెప్పాను. ఎందుకంటే ఆ సినిమాపై వచ్చిన వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉండింది. ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ నిరాశ చెందాల్సిన పని లేదు. మరింత గొప్పగా, భారీగా మీ ముందుకు వస్తాను’’ అని ఉన్ని ముకుందన్ స్పష్టం చేశారు.
మార్కో: హింస, ప్రతీకారానికి కొత్త నిర్వచనం!
హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డిసెంబర్లో విడుదలై ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం… ఒక శక్తిమంత కుటుంబం, వారి వ్యాపార సామ్రాజ్యం, అంతర్భాగంగా ఉండే వారసుడి కథ నేపథ్యంలో సాగింది. ఉన్ని ముకుందన్ డేరింగ్ పెర్ఫార్మెన్స్కి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.
‘‘మార్కోలో హింస? అది మానవ పరిణామమే!’’
మార్కో సినిమాపై హింస ఎక్కువగా చూపించారన్న విమర్శలపై స్పందిస్తూ ఉన్ని ముకుందన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు –
“మేము తీయదలిచిన దాని 30 శాతం మాత్రమే చూపించాం. హింసను మేమూ ప్రోత్సహించలేదు. మానవ పరిణామంలో హింస ఒక భాగం. నేటి ప్రేక్షకులు పరిణతి చెందినవారు. యాక్షన్ సినిమాలపై ఆసక్తి పెరిగింది,” అని వివరించారు.
ఏదైమైనా మార్కోకి సీక్వెల్ లేదన్న వార్త అభిమానులను నిరాశ పరచినా… ఉన్ని ముకుందన్ కొత్త ప్రాజెక్టులపై మరింత ఆసక్తిని పెంచింది. ఆయన ‘మార్కో కంటే పెద్దది’ అనే హింట్ ఇవ్వడం… మరో సాలిడ్ యాక్షన్ డ్రామాకి నాంది కావచ్చు!