
థియేటర్లలో నిశ్శబ్ద విప్లవం.. ‘గాంధీ టాక్స్’ ఏం చెప్పబోతోంది? ఎప్పుడు రిలీజ్
సత్యం, అహింస, మౌనం.. ఈ మూడు ఆయుధాలతో ప్రపంచ గమనాన్ని మార్చిన మహాత్మా గాంధీ భావజాలం నేటి కాలానికి ఎంతో అవసరం. ఆ మహనీయుడి సిద్ధాంతాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ, మారుతున్న సమాజంలో గాంధీ మార్గం ఎంతటి ప్రశాంతతను ఇస్తుందో చెప్పేందుకు వస్తోంది “గాంధీ టాక్స్” (Gandhi Talks). మరీ ముఖ్యంగా, మాటల హోరు పెరిగిపోయిన ఈ రోజుల్లో ‘మౌనం’ అనే భాషతో ఈ కథను చెప్పబోతుండటం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
గాంధీ భావజాలం.. మౌనంతోనే మ్యాజిక్!
సినిమా అంటే కేవలం డైలాగులు, భారీ ఫైట్లు మాత్రమే కాదు.. నిశ్శబ్దం ద్వారా కూడా భావాలను లోతుగా పలకించవచ్చని ఈ చిత్రం నిరూపించబోతోంది. ఒక నిశ్శబ్ద చిత్రం (Silent Film) ద్వారా గాంధేయవాదాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది దర్శకుడు కిషోర్ బేలేకర్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నం. అందుకే ఈ చిత్రానికి బాపు వర్ధంతి రోజైన జనవరి 30, 2026ని విడుదల తేదీగా ఫిక్స్ చేశారు.
స్టార్ నటులు.. సైలెంట్ యాక్టింగ్!
నటనలో శిఖరాగ్రాన ఉన్న విజయ్ సేతుపతి, స్టైలిష్ స్టార్ అరవింద్ స్వామి, అతిలోక సుందరి అదితి రావు హైదరి.. వీరంతా మాటలు లేకుండా కేవలం కళ్లతో, హావభావాలతో గాంధీ సందేశాన్ని ఎలా పలికిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆధునిక కాలంలో వస్తున్న ఈ ప్యూర్ పెర్ఫార్మెన్స్ మూవీ భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతోంది.
రెహమాన్ సంగీతం.. మౌనానికి భాష!
డైలాగులు లేని చోట సంగీతమే ఆయువుపట్టు. అందుకే ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ ద్వారా గాంధీ భావజాలాన్ని ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా డిజైన్ చేశారు. జీ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేటి యువతకు గాంధీ సిద్ధాంతాలను కొత్త కోణంలో పరిచయం చేయబోతోంది.
