రికార్డింగ్ స్టూడియోలో అంతా సిద్ధం.. మ్యూజిషియన్స్ అంతా వెయిటింగ్.. కానీ లెజెండరీ సింగర్ కేజే యేసుదాస్ మాత్రం రాలేదు! సరిగ్గా ఆ క్షణంలో ఇళయరాజా తీసుకున్న ఒక నిర్ణయం , సంగీత చరిత్రలోనే ఒక అద్భుతమైన పాట పుట్టడానికి కారణమైంది. ఆ తర్వాత యేసుదాస్ వచ్చి ఆ పాట పాడనని ఎందుకు మొండికేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
తమిళ సినీ సంగీత సామ్రాజ్యంలో ఇళయరాజా , యేసుదాస్ కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్. కానీ ఒకానొక సందర్భంలో ఇళయరాజా ఎంత బ్రతిమాలినా , తన గొంతు ఆ పాటకు పనికిరాదంటూ యేసుదాస్ తేల్చి చెప్పారు. అసలు ఆ పాట ఏది? అంతటి గొప్ప గాయకుడు ఒక పాటను పాడనని ఎందుకు వెనుదిరిగారు? ఆసక్తికరమైన ఆ విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అది 1982వ సంవత్సరం.. ‘తాయ్ మూకాంబికై’ అనే చిత్రం కోసం ఇళయరాజా ఒక అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఆ పాటను యేసుదాస్‌తో పాడించాలని ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు యేసుదాస్ అనుకోని కారణాల వల్ల స్టూడియోకు రాలేకపోయారు. సమయం వృథా కాకూడదని , ఇళయరాజానే స్వయంగా ఆ పాటను పాడి డమ్మీ రికార్డింగ్ చేశారు.
మరుసటి రోజు స్టూడియోకు వచ్చిన యేసుదాస్‌కు , ఇళయరాజా తాను పాడిన ఆ రికార్డింగ్‌ను వినిపించారు. ఆ పాట విన్న వెంటనే యేసుదాస్ కళ్లు చెమర్చాయి. అంతటి గాన గంధర్వుడు ఆ సాంగ్ వినగానే నిశ్శబ్దమైపోయారు. ఇళయరాజా గారూ.. ‘ఈ పాటలో ఉన్న ఫీల్ , ఆ డెప్త్ కేవలం మీ గొంతుతోనే సాధ్యం. నేను పాడితే ఆ ఆత్మ ఉండదు. ఇది మీ గొంతులోనే కలకాలం నిలిచిపోవాలి’ అంటూ ఆయన పాడటానికి ససేమిరా అన్నారు. ఇళయరాజా ఎంత రిక్వెస్ట్ చేసినా యేసుదాస్ వినలేదు. అలా ఇళయరాజా గొంతులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మాస్టర్‌పీస్ సాంగే… “జననీ జననీ జగం నీ , అగం నీ”.

ఒక గొప్ప కళాకారుడు తన కంటే మెరుగ్గా మరొకరు అవుట్‌పుట్ ఇచ్చారని భావించి , ఆ అవకాశాన్ని వదులుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. అందుకే ‘జననీ జననీ’ పాట నేటికీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. యేసుదాస్ చూపిన ఆ నిబద్ధత , ఇళయరాజా అందించిన ఆ మధురమైన స్వరం వెరసి ఆ పాట ఒక ఎవర్ గ్రీన్ మాస్టర్‌పీస్‌గా నిలిచిపోయింది.

