సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్- ఫిల్మ్ ఛాంబర్ మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఈ కార్మికుల వివాదం మొదలైందని వినికిడి. వివరాల్లోకి వెళితే…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. సినిమా కమిట్మెంట్స్ పట్ల మాత్రం తన స్టైల్లో డెడికేషన్ చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇటీవలే హరిహర వీరమల్లు పూర్తి చేసిన పవన్, ఓజీ పనులను సైతం కంప్లీట్ చేశారు. ఇప్పుడు తన నెక్స్ట్ బిగ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో భాగస్వామ్యం అవుతున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా కొనసాగుతోంది.
అయితే, ఈ సెట్లోనే ఈరోజు ఉదయం తలెత్తిన ఉద్రిక్తత ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినీ కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి ఫిలిం ఫెడరేషన్ పిలుపుతో షూటింగ్స్‌కు బహిష్కారం ప్రకటించగా.. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం ఆగకుండా కొనసాగడం వివాదంగా మారింది.
వేతనాల్లో 30 శాతం పెంపు లేకుంటే షూటింగ్స్ బహిష్కరించాలని ఫెడరేషన్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ మాత్రం షూటింగ్ నిలిపేయకుండా చెన్నై, ముంబయి నుంచి టెక్నీషియన్లను తీసుకొచ్చి పనులు కొనసాగిస్తున్నారని టాక్.
దీంతో ఫిలిం ఫెడరేషన్ నేతలు ఆ సెట్లోకి వెళ్లి నిరసన తెలపగా.. పరిస్థితి టెన్షన్‌కు దారి తీసింది. మేకర్స్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతూ సెట్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంతటి గందరగోళ సమయంలో పవన్ కళ్యాణ్ సెట్స్‌లో ఉన్నారా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ, ‘పవన్‌ని మేము కలవాలి.. మా బాధ ఆయనకు చెప్పాలి’ అంటూ ఫెడరేషన్ నేతలు నినాదాలు చేసినట్టు సమాచారం.