
రకుల్ ప్రీత్‌పై ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలు… డాక్టర్ వీడియోకి హీరోయిన్ షాకింగ్ రిప్లై!!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కారణం ఆమె సినిమా కాదు, ఆమె లుక్స్‌పై చేసిన ఆరోపణలు. ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న డాక్టర్ ప్రశాంత్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో, రకుల్‌ను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. ఆ వీడియోలో రకుల్ ప్రీత్ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆ వీడియోలో రకుల్ పాత ఫోటోలు, తాజా ఫోటోలు చూపిస్తూ ఆమె ముక్కు శస్త్రచికిత్స చేయించుకుందని, స్మైల్ లైన్స్ కనిపించకుండా పోయాయని, జా లైన్ డిఫినిషన్ కోసం చిన్ బోటాక్స్ వాడిందని ప్రశాంత్ యాదవ్ పేర్కొన్నాడు. ఇవన్నీ అవగాహన కోసం మాత్రమే చేశానని, ఎవ్వరినీ అవమానించాలనే ఉద్దేశం లేదని కూడా అతను తన పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ వివరణలు రకుల్‌కు ఏమాత్రం నచ్చలేదు.
ఈ ఆరోపణలకు రకుల్ ప్రీత్ సింగ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా గట్టిగానే స్పందించింది. ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమని ఆమె మండిపడింది. తాను నటిగా ప్రాచీన శాస్త్రం, ఆధునిక శాస్త్రం రెండింటినీ గౌరవిస్తానని, శస్త్రచికిత్సలు చేయించుకునే వారిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కానీ కష్టపడి చేసిన వెయిట్ లాస్‌ను, క్రమశిక్షణతో వచ్చిన మార్పును సర్జరీలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుదారి పట్టించడమేనని ఆమె వ్యాఖ్యానించింది.
డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి ఒక్కరినీ నమ్మకూడదని రకుల్ హెచ్చరించింది. ఫాక్ట్ చెక్ లేకుండా సెలబ్రిటీల పేర్లతో వ్యూస్ సంపాదించాలనే ప్రయత్నాలు భయంకరంగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియా ఎలా దాడి చేస్తుందో మరోసారి చర్చకు తెచ్చింది. రకుల్ స్పందన తర్వాత ఈ అంశం మరింత వైరల్ అవుతూ, ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది.
