నటుడు శివాజీ సొంటినేని మహిళల దుస్తులపై చేసిన చీప్, అసహ్యకర వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నెటిజన్లు అన్ని వైపుల నుంచి ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఇప్పుడే ఆగలేదు… ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా స్పందిస్తున్నారు.

శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ నటుడు మంచు మనోజ్, నటి అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి ముందుకు వచ్చారు. వీరంతా శివాజీ మాటలు ఆమోదయోగ్యం కావని, సమాజంలో ఇలాంటి ఆలోచనలకు చోటు లేదని స్పష్టం చేశారు.

మంచు మనోజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, ఒక సివిలైజ్డ్ సొసైటీ మహిళల హక్కులను కాపాడుతుందే తప్ప, వారి ఎంపికలను నియంత్రించదని వ్యాఖ్యానించారు. శివాజీ వ్యాఖ్యలకు ఆయన తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తూ, ఆ మాటలకు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే, ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు మొత్తం పురుషులకీ, సినిమా పరిశ్రమకీ ప్రతినిధులు కాదని స్పష్టంగా పేర్కొన్నారు.

అనసూయ భరద్వాజ్ మాత్రం శివాజీ పేరు ప్రస్తావించకుండా స్పందించారు. మహిళ తన శరీరంపై, తన దుస్తులపై పూర్తి హక్కు కలిగి ఉంటుందని ఆమె అన్నారు. “ఇది నా శరీరం, నీది కాదు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

గాయని చిన్మయి కూడా ఘాటుగా స్పందించారు. ఎవరూ అడగకుండానే సలహాలు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే శివాజీ వాడిన “దరిద్రపు ఎం**దా” అనే పదాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి భాష వాడటం మహిళల పట్ల ఉన్న సెక్సిస్ట్, మిసోజినిస్టిక్ మైండ్‌సెట్‌ను బయటపెడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతటి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, శివాజీ ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదంపై ఆయన మౌనం మరింత చర్చకు దారితీస్తోంది.

#Anasuya Bharadwaj, #Chinmayi Sripaada, #Dhandoraa, #Manchu Manoj, #Sivaji, #sivaji controversial comments

By admin