ఒక్క మాట… ఒక్క స్లిప్… అదే మాట ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మహిళలపై దాడిగా మారాయని ఆరోపణలు రావడంతో, ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సెలబ్రిటీలలో అనసూయ కూడా ఒకరు. అక్కడితో ఆగాల్సిన విషయం, ఇప్పుడు మాటల యుద్ధంగా మారుతోంది.

వివాదం చెలరేగిన తర్వాత శివాజీ తన మాటలపై క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ అనసూయ వ్యాఖ్యలపై ఆయన స్పందించిన తీరు మరోసారి చర్చకు దారితీసింది. “అనసూయ గారు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవును, నా హీరోయిన్స్‌పై దాడులు జరుగుతుంటే నేను ఇన్‌సెక్యూర్ అవుతాను. అనుకోని ఘటనలు జరిగితే భయపడతాను. ఆమె నాపై జాలి చూపించారని అన్నారు. నాకు జాలి చూపించినందుకు అనసూయ గారికి ధన్యవాదాలు” అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నిజంగా వివరణేనా, లేక మరో రకమైన కౌంటరా అన్న చర్చ మొదలైంది.

ఇదే సమయంలో అనసూయ కూడా మౌనంగా ఉండలేదు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్‌కు వచ్చిన ఆమె, శివాజీ వ్యాఖ్యలపై నేరుగా స్పందించారు. “శివాజీ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మీ రికవరీకి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. నాకు నా కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంది. శివాజీ గారి మద్దతు నాకు అవసరం లేదు. అయినా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరి మధ్య మాటల తూటాలు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఒకరి వ్యాఖ్యకు మరో స్పందన… ఆ స్పందనకు మళ్లీ కౌంటర్… ఇలా ఈ వ్యవహారం రోజురోజుకీ పెద్దదవుతోంది. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయాల తేడానా, లేక మహిళలపై మాట్లాడే విధానంపై పెద్ద చర్చకు నాంది పలికే సంఘటనా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

#Anasuya Bharadwaj, #Sivaji, #Social Media, #Tollywood

By admin