స్టేజ్‌పై అలవోకగా అన్న మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మంటలు రేపితే, ఆ మంటలకు చల్లార్చే ప్రయత్నమే మరింత వివాదంగా మారితే? ఇప్పుడు శివాజీ విషయంలో అదే జరుగుతోంది. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పినట్టు కనిపించినా, ఆ మాటల వెనక ఉన్న ఆలోచనలే ప్రశ్నలకి దారితీస్తున్నాయి.

ఇటీవల పబ్లిక్ ఈవెంట్స్‌లో నిధి అగర్వాల్, సమంత ఎదుర్కొన్న అసహజ ఘటనల నేపథ్యంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అభిమానుల ప్రవర్తనను తప్పుబట్టాల్సిన చోట, ఆయన మాటలు మాత్రం నటీమణుల డ్రెస్సింగ్ సెన్స్ వైపు మళ్లాయని విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని తన వివరణలోనూ ప్రస్తావించడంతో, “ఇది బాధ్యత తీసుకోవడమా? లేక బాధితులనే నిందించడమా?” అన్న చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందన చాలా స్పష్టంగా, కటువుగా వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఒక్క లైన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “బాధితులను నిందించడం అనేది మానిప్యులేషన్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్య, ఈ మొత్తం వ్యవహారానికి సూటిగా సమాధానం ఇచ్చినట్టయ్యింది. ఎవరి దుస్తులూ తప్పు కాదు, తప్పు ప్రవర్తనను సమర్థించే ఆలోచనలే అసలు సమస్య అన్న సందేశం ఆమె మాటల్లో స్పష్టంగా వినిపించింది.

ఈ వివాదం ఇంకా చల్లారకముందే, సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ శివాజీ మాటలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షమాపణలు, మరోవైపు అదే ఆలోచనా ధోరణి కొనసాగుతోందన్న ఆరోపణలు, ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి.

ఇదిలా ఉండగా, ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో నిధి అగర్వాల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. వివాదాల మధ్య కూడా, తన పని మీదే ఫోకస్ పెట్టిన నిధి, మాట్లాడిన ఒక్క వాక్యంతోనే పెద్ద చర్చకు తెరతీసింది.

#Nidhi Agarwal, #Sivaji, #Sivaji Apology, #Social Media

By admin