సినిమా వార్తలు

రాజమౌళి బిజినెస్ స్కెచ్ మరోసారి వర్కౌట్ అవుతుందా?

సినిమా తీసి రిలీజ్ చేయడం రాజమౌళి స్టైల్ కాదు. మార్కెట్ ఎక్కడుంది, ప్రేక్షకులు ఎవరూ, ఆ సినిమా ఎంత దూరం వెళ్లాలి అన్నదాకా ముందే స్కెచ్ వేసుకుని అడుగులు వేయడం ఆయన బిజినెస్ స్ట్రాటజీ. బాహుబలి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు అదే ప్లానింగ్ వర్కౌట్ అయింది. ఇప్పుడు అదే తరహా గ్లోబల్ స్కెచ్‌ను ఆయన తన కొత్త సినిమా వారణాసి కోసం కూడా అమలు చేస్తున్నాడన్న చర్చ మొదలైంది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది దాదాపు ఆరు నెలల పాటు కీలక షెడ్యూల్స్ ఉండనున్నాయని ఇటీవల రాజమౌళి వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఐమ్యాక్స్ జపాన్ అధికారిక ఎక్స్ ఖాతా, వారణాసి గ్లింప్స్‌తో పాటు రిలీజ్ ఇయర్‌ను షేర్ చేయడంతో, జపాన్ రిలీజ్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో ఆర్‌ఆర్‌ఆర్ జపాన్‌లో అద్భుతమైన వసూళ్లు రాబట్టి రాజమౌళిని అక్కడ బలమైన బ్రాండ్‌గా మార్చింది.

ఇప్పుడు అదే మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, వారణాసిని గ్లోబల్ రిలీజ్‌తో పాటు జపాన్‌లోనూ ఒకేసారి విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఇలా చేస్తే సినిమా రీచ్ మరింత పెరగడంతో పాటు, ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉందన్నది ట్రేడ్ వర్గాల మాట.

షెడ్యూల్స్ అన్నీ ముందే పక్కాగా ప్లాన్ చేస్తే జపాన్ రిలీజ్ సాధ్యమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి వేసిన ఈ కొత్త బిజినెస్ స్కెచ్ వారణాసికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది.

Similar Posts