‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన అన్వేష్ గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ ల మోసాలపై వీడియోలు పెడుతున్నారు. తాజాగా అతను కమెడియన్ అలీపై తీవ్ర విమర్శలు చేశారు. అలీ తన ఛానల్‌లో సహాయం పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా అలీ, ఆయన భార్య కలిసి చేసిన ‘బిర్యానీ వీడియో’ ద్వారా ఎలా కోట్ల రూపాయలు సంపాదించారంటూ అన్వేష్ తన వీడియోలో వివరించారు. బెట్టింగ్ యాప్‌లపై గత కొంతకాలంగా పోరాడుతున్న అన్వేష్, ఈ సందర్భంగా అలీ మరో బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించటంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ… అలీని అభిమానించే వ్యక్తిగా ఆయన ఇలాంటి పనులు చేయడం బాధాకరమని అన్నారు. వేల కోట్ల ఆస్తులున్న అలీ వంటి వారు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ యాప్‌ల వల్ల అలీకి లాభం చేకూరినా, సామాన్య ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలీ గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వీడియోలను తొలగించినప్పటికీ, ప్రజలు వాటిని మరచిపోలేదని అన్వేష్ గుర్తు చేశారు. రంజాన్ మాసంలో కూడా అలీ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారని, అప్పుడు తాను మెసేజ్ చేస్తే, ‘దేవుడు ఎక్కడైనా చెప్పారా?’ అని అలీ తిరిగి ప్రశ్నించారని అన్వేష్ ఆరోపించారు.
ప్రజలకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ, హాని చేయకూడదని అన్వేష్ అన్నారు. అలీ ప్రోత్సహించే బెట్టింగ్ యాప్‌ల వల్ల లక్షల్లో ఆదాయం వస్తుండగా, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తెలంగాణలో నిన్ననే ఒక యువకుడు రైలు కింద పడి చనిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోయిన వారికి అలీ ఆర్థిక సహాయం చేయాలని, ఆ పాపపు సొమ్ముతోనే వారికి తిరిగి ఇవ్వాలని అన్వేష్ సూచించారు.
అలాగే అలీ తన భార్యతో కలిసి యూట్యూబ్‌లో పెట్టిన బిర్యానీ వీడియో ద్వారా ప్రజలను దారుణంగా మోసం చేశారని అన్వేష్ ఆరోపించారు. 15 కేజీల బిర్యానీ పంచిపెట్టిన వీడియోను పెట్టి, దాని ద్వారా 50 లక్షల వ్యూస్ పొందారని, తద్వారా దాదాపు రూ.5 లక్షలు సంపాదించారని ఆయన తెలిపారు. కేవలం రూ.10 వేలు ఖర్చు చేసి, సహాయం పేరుతో రూ.4.90 లక్షలు లాభం పొందారని, అదే వీడియోలో బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారని అన్వేష్ విమర్శించారు. అలీ మంచి పని చేశారని ప్రజలు నమ్మితే, అందులో బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించడం దారుణమని, ఇది బిర్యానీ పేరుతో చేసిన మోసమని అన్వేష్ పేర్కొన్నారు.