‘కాంటా లాగా’ గర్ల్ షఫాలీ జరివాలా (వయసు 42) ఆకస్మిక మరణం చుట్టూ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. మొదట గుండెపోటు అనుకున్నా… తాజా విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణానికి యాంటీ ఏజింగ్ మందులు, ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోవడమే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం ఉపవాసం… అదే రోజు ఇంజెక్షన్?
జూన్ 27న షఫాలీ ఉపవాసంగా ఉండగా, మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదే రాత్రి భర్త పరాగ్ ఆమెను అస్వస్థతతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
బీపీ ఒక్కసారిగా పడిపోవడం వల్లేనా?
పోలీసుల మాట ప్రకారం – ఖాళీ కడుపుతో మందులు వాడటం వల్ల షఫాలీ బీపీ ఒక్కసారిగా డ్రాప్ అయ్యి, వణుకుతో కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఆమె గుండెపోటుతో మరణించలేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా తెలిపారు. దీంతో ఇంజెక్షన్లు, మందుల కోణంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
ఇప్పటివరకు 10 మంది వాంగ్మూలాలు
అంబోలి పోలీసులు ఇప్పటికే ఆమె భర్త పరాగ్, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషితోపాటు ఆమె కుప్పకూలిన సమయంలో ఇంట్లో ఉన్నవారిని విచారించారు. ఇప్పటివరకు వారి వాంగ్మూలాల్లో అనుమానాస్పదమైన ఎటువంటి అంశాలు లేవని చెబుతున్నారు. అయితే నిజంగా ఎం జరిగింది అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే పూర్తిగా క్లారిటీకి రానుంది.
ఫోరెన్సిక్ బృందం ఇంట్లో దర్యాప్తు
ఇంతలో ఫోరెన్సిక్ టీమ్ కూడా షఫాలీ ఇంటికి వెళ్లి, ఆమె వాడిన మందులు, ఇంజెక్షన్ నమూనాలను సేకరించింది. వాటిపై శాస్త్రీయ పరీక్షలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోలీసులు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లు ఇచ్చిన క్లినిక్ వివరాలు, డాక్టర్ల వివరాలు కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు.
ఇక షఫాలీ ఆకస్మిక మరణానికి కారణం… వైద్య నిర్లక్ష్యమా?ఖాళీ కడుపు మీద తీసుకున్న హార్మోనల్ డ్రగ్స్ ప్రభావమా?
నిజం వెలుగులోకి రావాలంటే పోస్టుమార్టం రిపోర్టే కీలకం!