సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగబడతాయి. 170కి పైగా సినిమాల్లో నటించి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రజనీ, కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కానీ, రజనీకాంత్ తన కెరీర్‌లో ఒకే ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారన్న విషయం చాలామందికి తెలియదు. అసలు ఆ సినిమా ఏది? ఒక సెటిల్డ్ స్టార్ హోదాలో ఉండి కూడా ఆయన సహాయ దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మైసూరు షూటింగ్‌లో ఊహించని మలుపు!

1988లో రజనీకాంత్, ప్రభు ప్రధాన పాత్రల్లో ‘గురు శిష్యన్’ అనే సినిమా రూపొందింది. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మైసూరులోని బృందావన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. రజనీకాంత్ ఈ సినిమా కోసం 25 రోజుల కాల్షీట్ ఇచ్చారు. ఒక పాటలో రజనీకాంత్ నటించగా, రెండో పాటను హీరో ప్రభు, సీతలపై చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారు.

రూమ్‌లో ఖాళీగా ఉండలేక.. రజనీ ఏం చేశారంటే?

ప్రభుపై పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో రజనీకాంత్‌కు రెండు రోజుల పాటు పని లేదు. దర్శకుడు ముత్తురామన్ ఆయనను చెన్నై వెళ్లి రమ్మని చెప్పినా రజనీ వినలేదు. “నేను మీకు 25 రోజులు డేట్స్ ఇచ్చాను.. నా రెండు రోజులను వృథా చేయకండి” అని రజనీ ఖచ్చితంగా చెప్పారు.

మరుసటి రోజు నేరుగా షూటింగ్ సెట్‌కు వెళ్లిన రజనీకాంత్, తాను జీతం తీసుకుని ఖాళీగా కూర్చోవాలనుకోవడం లేదని చెప్పారు. తనకు ఏదైనా పని చెప్పమని దర్శకుడిని కోరారు. దర్శకుడు సరే అనడంతో, ఆ రెండు రోజుల పాటు తాను ‘అసిస్టెంట్ డైరెక్టర్‌’గా పనిచేస్తానని రజనీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా సూపర్ స్టార్!

చెప్పినట్లుగానే ఆ రెండు రోజులు ప్రభు, సీతలపై చిత్రీకరించిన ‘వా వా వంజి ఇలమానే…’ అనే పాటకు రజనీకాంత్ సహాయ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. షూటింగ్ సెట్‌లో ఒక సామాన్య అసిస్టెంట్‌లా మారిపోయి పనులన్నీ చక్కబెట్టారు. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని చూసి యూనిట్ సభ్యులంతా ముక్కున వేలేసుకున్నారు.

రజనీకాంత్ కేవలం స్క్రీన్ మీదే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టారే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సమయాన్ని వృథా చేయకూడదనే ఆయన క్రమశిక్షణే నేడు ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఆయన ఏ పని చేసినా అది చరిత్రగా మారిపోతుంది.

#Assistant Director, #Guru Sishyan, #prabhu, #Rajinikanth, #SP Muthuraman

By admin