

ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే సమయంలో దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC)హిట్స్ లేక వెనుకబడింది. ఈ సమయంలో ప్రొడక్షన్‌లో కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న దిల్ రాజు, తాత్కాలిక విరామం తీసుకుని, ఇప్పుడు తిరిగి శక్తివంతమైన కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు.
ఈ రీ-ఎంట్రీలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ డ్రామా OG చిత్రానికి నైజాం, విశాఖ ప్రాంతాల థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేట్‌తో దక్కించుకున్నారు. సినిమా రిలీజ్‌నే ప్రత్యేక ఈవెంట్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 హక్కులు తీసుకోవటంలో కూడా ముందంజలో ఉన్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకి కూడా SVCనే డిస్ట్రిబ్యూటర్‌గా నిలిచింది.
దీంతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని వరుస ప్రాజెక్టుల్నీ దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. 2026 నాటికి డిస్ట్రిబ్యూషన్ రంగంలో తిరిగి టాప్‌కి చేరుకోవడం ఆయన ప్రధాన టార్గెట్‌గా కనిపిస్తోంది.
ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో పాటు మరికొన్ని స్టార్ ప్రాజెక్టులను నిర్మించడానికి సిద్ధమవుతుండగా, తన మేనల్లుడు ఆశిష్‌ను మళ్లీ హీరోగా రీ-లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తం మీద, ఒకప్పుడు నైజాం కింగ్‌గా వెలిగిన దిల్ రాజు, తిరిగి తన సింహాసనం కైవసం చేసుకోవడానికి శక్తివంతమైన గేమ్ ప్లాన్ వేసుకున్నట్టే కనిపిస్తున్నాడు.