ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ కెరీర్ ని పరిశీలిస్తే, వరుస పరాజయాలతో దశలో ఉన్నాడు. ‘బోయ్ నెక్స్ట్ డోర్’ ఇమేజ్ ఉన్న ఈ హీరో, వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. అయినా తనను నమ్ముకున్న ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలనే నమ్మకంతో సిద్దార్థ్ తన సినిమా సెలెక్షన్‌లో కొత్త దారి ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో రూపొందిన తాజా చిత్రం ‘3BHK’. తమిళంలో రూపొందిన ఈ భావోద్వేగ ప్రధాన చిత్రం జూలై 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకలో సిద్దార్థ్ ఎమోషనల్ అవుతూ స్టేజ్‌పై కంటతడి పెట్టడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సిద్ధార్థ్ మాట్లాడుతూ – “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇది నా 40వ చిత్రం. నా తల్లిదండ్రులతో కలిసి ఈ జర్నీని పంచుకోవడం చాలా అర్ధవంతమైన విషయంగా అనిపించింది. నా తండ్రి ముఖంలో గర్వాన్ని చూసిన ఆ క్షణం నేను జీవితాంతం మర్చిపోలేను,” అంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టాడు.
అంతే కాదు – “నా తల్లిదండ్రులు నన్ను నమ్మారు. నా కలల్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డారు. వాళ్ల భరోసా, ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఈ సినిమా భావోద్వేగాలకు నన్ను బంధించింది. ఇది నాకు సినిమా మాత్రమే కాదు… ఓ కుటుంబం, ఓ కల, ఓ బాధ్యత,” అని అన్నాడు.
‘3BHK’ అనే టైటిల్ ఓ ఇంటి అవసరాన్ని సూచించడమే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి ఉండే ఆశయాలను, భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తోంది. శ్రీవణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీతా రఘునాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్‌గా చిత్రం జె. అచర్ నటించగా, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ కథ, ప్రేక్షకుల మనసును తాకేలా ఉండబోతోందని ఇప్పటికే ట్రైలర్‌తో చాటి చెప్పింది.
ఈ సినిమా ద్వారా సిద్దార్థ్ మళ్లీ తన స్థాయిని తిరిగి సంపాదించగలడా? భావోద్వేగాల మీదే కాకుండా, బాక్సాఫీస్‌పై కూడా ప్రభావం చూపగలడా? అన్నది జూలై 4న తెలుస్తుంది.