స్టార్ హీరోలు లేరు. ప్రమోషన్ పెద్దగా జరగలేదు. చాలా మందికి ఈ సినిమా ఉంది అనే విషయమే తెలియదు. కానీ జూలై 18న చిన్న సినిమా ‘సైయారా’ బాక్సాఫీసు తలుపుతట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై, మౌత్ టాక్‌తో మెల్లిగా దూసుకెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇది మరోసారి చాటింది — కంటెంట్ ఉండాలి కానీ, కమ్మకూడు కాదు!
ఎమోషన్‌నే అస్త్రంగా చేసిన సినిమా
ఈ చిత్రంలో యాక్షన్ బ్లాక్స్ లేవు. పంచ్ డైలాగులు లేవు. బడా బడా విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కానీ ఎమోషన్ మాత్రం చాలా గట్టిగా ఉంది. అదే సినిమాకి మెయిన్ బలంగా నిలిచింది. కథలో కొత్తదనం ఏం లేదు, కానీ ఆ కథ చెప్పిన తీరు, పాత్రల మౌనమైన బాధ, ప్రేమలోని లోతు — ఇవే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కథలోకి వెళ్తే…
క్రిష్ కపూర్ అనే యువకుడికి సంగీతం మీద పిచ్చి. అతడు గొప్ప సంగీత దర్శకుడిగా అవతరించాలన్నది తన కల. అదే సమయంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న వాణీ బాత్రా అతడిని ఒక సందర్భంలో కలుస్తుంది. వాణీకి క్రిష్ అంటే నచ్చుతుంది, ఆ నచ్చటం ప్రేమగా మారుతుంది.
కానీ ఆమె గతంలో ప్రేమ పేరుతో మోసం చేసిన మహేశ్ తిరిగి ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మానసికంగా బలహీనంగా మారిన వాణి… తన జీవితంపై ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మహేశ్ రాకతో క్రిష్ మారుతాడా? తన కల నెరవేరుతుందా? చివరికి వాణి ఎవరిని పెళ్లి చేసుకుంది? అన్నదే కథ.
ఓవర్సీస్‌లో సైయారా తుఫాను!
ఇండియాలో మెల్లగా నడుస్తున్నా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం సైయారా తుఫాను సృష్టిస్తోంది! విడుదలైన మొదటి రోజు $425K వసూళ్లు వచ్చాయి. కానీ రెండో శుక్రవారం ఒక్కరోజే $1.1 మిలియన్ వచ్చాయి — అంటే ఫస్ట్ డే కంటే డబుల్! ఇప్పటివరకు ఈ చిత్రం $6.1 మిలియన్ వసూలు చేసింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఫుల్ రన్‌లో కనీసం $15 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉంది.
మ్యూజిక్, పెయిర్ అద్భుతం
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనేక సంగీత దర్శకులు పని చేశారు. పాటలు ప్రేక్షకుల్ని వెంటాడేలా చేశాయి. తాజా జంటగా అహాన్ పాండే, అనీత్ పద్దా కెమిస్ట్రీ నేచురల్‌గా నిండుగా కనిపించింది.
చివరగా…
ఓ ప్రేమకథను అంతగా ప్రచారం లేకుండా ప్రజల హృదయాల్లోకి చొప్పించి, సైలెంట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సైయారా’. ఇది స్టార్స్ కాదు, స్టోరీలే రాణించేవి అనే సత్యాన్ని మరోసారి ఋజువు చేసింది.